కర్ణాటక రాష్ట్రం దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఆర్‌టీ-పీసీఆర్ కోవిడ్ ల్యాబ్‌ను బెంగళూరులో ప్రారంభించింది. కర్ణాటక వైద్యవిద్య మంత్రి డాక్టర్ సుధాకర్ ఈ ల్యాబ్‌ను ప్రారంభించారు. దేశంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న మొబైల్ ల్యాబ్‌లలో ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులనే చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో ఆర్‌టీ-పీసీఆర్ టెక్నాలజీ సహాయంతో కోవిడ్ టెస్టులు చేసేందుకు గాను ఈ మొబైల్ ల్యాబ్‌ను కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి గాను ఐసీఎంఆర్ అనుమతి కూడా లభించింది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) వారు ఈ ల్యాబ్‌ను రూపొందించారు. కాగా ఈ ల్యాబ్ సహాయంతో నెలకు 9వేల కరోనా టెస్టులు చేయవచ్చు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచనున్నారు. ఈ ల్యాబ్ ద్వారా కరోనా శాంపిల్స్‌ను పరీక్షించి కేవలం 4 గంటల్లోనే 100 శాతం కచ్చితమైన ఫలితాలను పొందవచ్చు.
బెంగళూరులోని కోవిడ్ హాట్‌స్పాట్‌లలో ఈ మొబైల్ ల్యాబ్‌ను ఉంచి పరీక్షలు చేస్తారు. దీని వల్ల ఎంతో సమయం ఆదా అవుతుంది. కరోనా అనుమానితులు వేగంగా టెస్టులు చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ల్యాబ్ సహాయంతో కేవలం కోవిడ్ టెస్టులే కాదు, స్వైన్ ఫ్లూ, హెపటైటిస్ సి, టీబీ, హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్ఐవీ టెస్టులు కూడా చేయవచ్చు. కాగా ప్రస్తుతం కర్ణాటకలో నిత్యం 40వేలకు పైగా కరోనా టెస్టులు చేస్తున్నారు. వాటిల్లో చాలా టెస్టులు ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులే కావడం విశేషం. ఇప్పటి వరకు అక్కడ 15,32,654 టెస్టులు చేశారు.