కరోనా సమయంలో పేదలను ఆర్ధికంగా ఆదుకోవడానికి గానూ నెలకు రూ.500 చొప్పున మూడు నెలలపాటు జమ చేస్తామని కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇచ్చిన మాట ప్రకారం నిధులను విడుదల చేసింది. ఈ నేపధ్యంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోని 473 శాఖల్లో సుమారు 9లక్షల మంది ఖాతాల్లో ఏప్రిల్ నెలకు గానూ రూ.500 చొప్పున చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఈ నేపధ్యంలో తెలంగాణా గ్రామీణ బ్యాంకు 5,15,260 మంది మినహా మిగిలిన వారిని అనర్హులుగా గుర్తించింది. దీనితో రాష్ట్రంలో దాదాపు 3 లక్షల జన్‌ధన్ ఖాతాలకు పీఎంజీకేవై కింద జమచేసిన రూ.16కోట్లకు పైగా నగదు ని వెనక్కు తీసుకుంది దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది బ్యాంకు. 1 ఆగస్ట్, 2014 తర్వాత ప్రారంభించిన ఖాతాలనే అర్హులుగా తేల్చినట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం మహేశ్ ప్రకటించారు.
ఈ నెల మొదటి వారంలో దేశ వ్యాప్తంగా ఈ నగదు జమ చేసింది కేంద్ర సర్కార్. తమ వద్ద జరిగిన పొరపాటుతోనే నగదును అనర్హులకు జమచేశామని ఆయన వివరించారు. వారంరోజుల తర్వాత గుర్తించి వెనక్కి తీసుకున్నామని పేర్కొన్నారు. అనర్హుల్లో ఇప్పటికే లక్షకు పైగా ఖాతాదారులు నగదును తీసుకున్నారని ఆయన వివరించారు. వారి నుంచి తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.