విదేశాల్లో ఐపీఎల్‌..? బీసీసీఐ ఆలోచన..

-

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020ని ఎలాగైనా సరే నిర్వహించాలని ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఈ సారి ఐపీఎల్‌ విదేశాల్లో జరుగుతుందని జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఈ మేరకు బీసీసీఐ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎల్‌ను ఈసారి ఎలాగైనా నిర్వహించేందుకు తమ వద్ద అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తున్నామని, దేశంలో ఐపీఎల్‌ను నిర్వహించే పరిస్థితి లేకపోతే.. విదేశాల్లో ఆ టోర్నీని నిర్వహిస్తామని, అయితే అది తమకు ఉన్న చివరి ఆప్షన్‌.. అని తెలిపారు.

కాగా ఐపీఎల్‌ 2020 ఎడిషన్‌ మార్చి 29వ తేదీన ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా వల్ల ఆ టోర్నీని నిరవధికంగా వాయిదా వేవారు. ప్రస్తుతం కేంద్రం ఆంక్షలను సడలించడంతో స్టేడియాలలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లను నిర్వహించుకునే వీలు ఏర్పడింది. అయితే అలా మ్యాచ్‌లను నిర్వహించినా తమకు భారీగా నష్టం వస్తుందనే ఆలోచనలో ఉన్న బీసీసీఐ అక్టోబర్‌, నవంబర్‌ నెలల మధ్య ఐపీఎల్‌ను నిర్వహించాలని చూస్తోంది. కానీ అదే సమయంలో టీ20 వరల్డ్‌ కప్‌ ఉంది. కాగా కరోనా నేపథ్యంలో ఆ టోర్నీ జరిగే విషయంపై కూడా సందేహాలు నెలకొన్నాయి.

జూన్‌ 10వ తేదీన టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ ఇప్పటికే తెలపడంతో ఆ తేదీ కోసం బీసీసీఐ వేచి చూస్తోంది. వరల్డ్‌ కప్‌ నిర్వహణపై క్లారిటీ వస్తేగానీ.. ఇండియాలో ఐపీఎల్‌ నిర్వహణపై స్పష్టత రాదని.. బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే వరల్డ్‌ కప్‌ను వాయిదా వేసినా భారత్‌లో ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశం లేకపోతే.. అప్పుడు చివరి ఆప్షన్‌గా విదేశాల్లోనే ఐపీఎల్‌ను నిర్వహించాల్సి వస్తుందని బీసీసీఐ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. కాగా విదేశాల్లో ఐపీఎల్‌ జరగడం కొత్తేమీ కాదు. గతంలో 2009 ఎన్నికల సందర్భంగా సౌతాఫ్రికాలో ఐపీఎల్‌ జరగ్గా, 2014 ఎన్నికల్లోనూ యూఏఈలో ఐపీఎల్‌ను నిర్వహించారు. మరిప్పుడు కరోనా నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version