టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ ఎంతోమంది ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించారు. అలాగే ధోనికి గొప్పగా వీడ్కోలు పలికేందుకు అతని స్వస్థలం రాంచీలో ఓ ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించాలంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐని కోరారు. అయితే దానిపై స్పందించిన ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా ధోని కోసం ఫేరెవెల్ మ్యాచ్ నిర్వహించడం కుదరదని చెప్పారు. కానీ, తాజాగా.. ధోనీకి ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ అనంతరం ధోనీ వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ధోనీ భారత క్రికెట్‌కు ఎంతో చేశాడని, గ్రాండ్ సెండాఫ్ అందుకోవడానికి అతను అన్ని విధాల అర్హుడని ఆయన అన్నారు. అయితే ఈ ఫేర్‌వెల్ మ్యాచ్‌కు ధోనీ ఒప్పుకుంటాడా..? లేదా..? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ లు సాధా సీదాగానే ఆటకు గుడ్ బై చెప్పేశారు. ఈ క్రమంలోనే ధోనీ ఫేర్‌వెల్ మ్యాచ్ పై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.