వరుస రాజకీయ పరిణామాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ యుద్ధం బాగానే జరుగుతుంది. ఉన్నవి రెండే పక్షాలు, రెండే పార్టీలు కావడంతో ఎవరికి వారు తమని తాము ఉన్నతులం అని చెప్పుకుంటున్నారు. ఆ విధంగా చెప్పుకుని రాజకీయంగా ఎదిగేందుకు దారులు వెతుకుతున్నారు. ఇదే సమయంలో వస్తున్నకాలంలో ప్రజలను ఏ విధంగా తమవైపు తిప్పుకోవాలో అన్నది ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కానీ చంద్రబాబు కానీ వీలువెంబడి బీజేపీతో దగ్గరగా ఉండేందుకే చూస్తున్నారు.
జగన్ మాత్రం ఫలితాలతో సంబంధం లేకుండానే బీజేపీ తో ప్రేమలో ఉండాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. చంద్రబాబు దారి మాత్రం వేరేగా ఉంది. వీలున్నంత వరకూ కొత్త ఫ్రంట్ ను ఏర్పాటుచేసి బీజేపీకి ఝలక్ ఇవ్వాలని చూస్తున్నారు. కానీ అటు చంద్రబాబుకు కానీ ఇటు కేసీఆర్ కు కానీ పరిణామాలు అంతగా అనుకూలించడం లేదు. కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనే శక్తి వీళ్లలో ఎవ్వరికీ లేదు.
ఇక జగన్ ఉద్దేశం మాత్రం అటు పార్లమెంట్లోనూ, బయట కూడా కేసీఆర్ తో స్నేహం కోరుకుంటూనే ప్రధాని మోడీ కి అండగా ఉంటున్నారు. కేసీఆర్ మాత్రం మోడీని వ్యతిరేకిస్తున్నారు. ఇదెక్కడి రాజకీయమో అని అడగకండి.. రాజకీయాలన్నీ అలానే ఉంటాయి. ఉంటాయి కూడా! ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్ర స్థాయిలో బీజేపీ పై వ్యతిరేక స్వరం వినిపించినా, రేపు ఎన్నికల వేళ అదేవిధంగా కేసీఆర్ ఉంటారా? లేదా అదే స్థాయిలో జగన్ ఉంటారా?
రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వార్థ ప్రయోజనాలే ఎక్కువ అని భావించే జగన్ నుంచి మనం ఇంతకుమించి ఏమీ ఆశించలేం అని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటివరకూ కేసుల భయంతోనే ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు, మనకు రావాల్సిన నిధులు అడిగేందుకు ఇష్టపడడం లేదని కూడా స్పష్టం అయిపోయిందని టీడీపీ అంటోంది. ఫ్లోర్ లో అడగకుండానే బీజేపీకి మద్దతిస్తూవస్తున్న జగన్ అదే స్థాయిలో రాష్ట్రానికి నిధులు మాత్రం తేవడం లేదు.
ఎప్పుడు వెళ్లినా శాలువలతో పీఎంను సత్కరించి రావడం తప్ప ఆయన సాధించిందేమీ లేదన్న విమర్శ విపక్షం నుంచి వస్తోంది. ఈ తరుణంలో జగన్ కానీ అతని మంత్రివర్గం కానీఇతర ఎంపీలు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడతారు అని అనుకోవడం ఓ పెద్ద భ్రమ. భ్రమలు తొలగిపోతే వాస్తవాలు ఏంటన్నవి తేలిపోతాయి.