కిచెన్ ఓ బ్యూటీపార్లర్.. ఈ వస్తువులతో అందం మీ సొంతం..

-

మన వంటింట్లో లేని సామగ్రి ఉండదు. ఆరోగ్యం నుంచి అందం వరకు దేనికి సంబంధించిన వస్తువైనా సరే కిచెన్ నుంచి రావాల్సిందే. కొందరు జిడ్డు చర్మాన్ని వదిలించుకోవడానికి రకరకాల సబ్బులు వాడుతుంటారు. మొటిమల్ని నివారించుకోవడానికి పలు రకాల క్రీమ్‌లు రాసుకుంటారు.  మీ వంటగదినే బ్యూటీపార్లర్‌లా మార్చుకోవచ్చని మీకు తెలుసా.. మీ కిచెన్ లో మిమ్మల్ని అందంగా తయారు చేయగలిగే పదార్థాలున్నాయని తెలుసా.. అవునండీ.. వంటగదిలో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన ఫేస్‌ప్యాక్స్ వాడితే మీ చర్మ సమస్యలు ఇట్టే దూరమవుతాయి.

 

గుమ్మడితో గుబాళించే అందం.. గుమ్మడి కాయ కూరగానే కాదు మిమ్మల్ని అందంగా తయారు చేస్తుంది కూడా.

కావాల్సినవి: బాగా పండిన గుమ్మడి పండు గుజ్జు – 2 చెంచాలు;  తేనె – అర చెంచా; పాలు – అర చెంచా; దాల్చినచెక్క పొడి – పావు చెంచా
తయారీ: ముందుగా గుమ్మడి పండు గుజ్జును ఒక పాత్రలో తీసుకోవాలి. దీనిలో తేనె, పాలు, దాల్చిన చెక్క పొడి వేసి ముద్దగా కలుపుకోవాలి.

గుమ్మడికాయతో ఫేషియల్ ఎలా తయారు చేయాలంటే..  ముందుగా ముఖాన్ని శుభ్రపరచుకొని కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకొని మెత్తటి గుడ్డతో తుడుచుకోవాలి. ఈ విధంగా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మీ ముఖం కాంతివంతమవుతుంది. గుమ్మడి పండులో విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కంటికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖంపై ఉన్న మొటిమలు పోయి చర్మం మృదువుగా మారుతుంది.

గుడ్డుతో హెల్దీ చర్మం..

కావాల్సినవి: కోడిగుడ్డు – ఒకటి; నిమ్మరసం – ఒక చెంచా; పెరుగు – ఒక చెంచా;

తయారీ: ముందుగా కోడిగుడ్డులోని తెల్ల సొనను వేరు చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. దీనిలో నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.

ఫేషియల్ ఇలా.. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ముఖానికి పట్టించి దాదాపు 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా కనీసం వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి కోమలంగా తయారవుతుంది.

ఈస్ట్ పౌడర్‌తో ఇలా..

కావాల్సినవి: కోడిగుడ్డు – ఒకటి; ఈస్ట్ పౌడర్ – రెండు చెంచాలు; కలబంద గుజ్జు – ఒక చెంచా;

తయారీ: ముందుగా కోడిగుడ్డు తెల్లసొనను ఒక పాత్రలో తీసుకోవాలి. దానిలో ఈస్ట్ పౌడర్, కలబంద గుజ్జు వేసి ముద్దగా కలుపుకోవాలి.

ఫేషియల్ ఇలా!

ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఓ అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతమవుతుంది.

ఓట్స్‌తో..

కావాల్సినవి: ఓట్స్ – ఒక చెంచా; మీగడ లేని పెరుగు – మూడు చెంచాలు; తేనె – ఒక చెంచా;

తయారీ: మెత్తగా పొడి చేసిన ఓట్స్‌లో పెరుగు, తేనె వేసి ముద్దగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి.

ఫేషియల్ ఇలా.. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ ఫేషియల్ వల్ల చర్మానికి మృదుత్వం, తాజాదనం వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version