రోజులు గడుస్తున్నకొద్దీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వేడి పెరుగుతోంది. బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా బీజేపీ నేత సువేందు అధికారి సీఎం మమతపై నిప్పులు కురిపించారు. ఆయన దీదీపై పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో ఓ ఆలయంలో పూజలు చేసిన అనంతరం మాట్లాడుతూ దీదీపై తీవ్ర విమర్శలు చేశారు.
పశ్చిమ బెంగాల్ ప్రజలు మమతకు ఓటు వేసి ఆమెకు మళ్లీ అధికారం అప్పగిస్తే బెంగాల్ మినీ పాకిస్థాన్‌గా మారుతుందని ఆరోపించారు. దీదీ ప్రజలకు ఈద్ ముబారక్ చెబుతుందని, కానీ హోలీ ముబారక్ చెప్పి దొరికిపోయిందని అన్నారు. ఆమె ఇంత సడెన్‌గా ఆలయాల్లో పూజలు చేస్తుండడం వెనుక రాజకీయ లబ్ధి ఉందని ఆరోపించారు. హిందువుల ఓట్లు ఎక్కడ రావోనని ఆమె ఆలయాల్లో పూజలు చేస్తున్నారని ఆరోపించారు.
బెంగాల్ ప్రజలు బేగమ్ (దీదీ)కి ఓటు వేస్తారో, బీజేపీకి ఓటు వేస్తారో తేల్చుకోవాలని అన్నారు. దీదీ ఒకప్పుడు రూ.400 ఖరీదు చేసే చీరను ధరించే వారని, ఇప్పుడు ఆమె ధరించే చీర ఖరీదు రూ.6వేలని ఎద్దేవా చేశారు. ఆమె గతంలో అజంతా షూస్ ధరిస్తే ఇప్పుడు బ్రాండెడ్ షూస్ ధరిస్తున్నారని, గతంలో కారులో వెళ్లేదని, ఇప్పుడు హెలికాప్టర్‌లో వెళ్తుందని, ప్రజలు దీన్ని గమనించాలని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్య నాథ్ సీఎంగా ప్రజలకు చక్కని పాలనను అందిస్తున్నారని, అలాంటి పాలన కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని సువేందు అధికారి కోరారు. కాగా నంద్రిగామ్‌లో ఏప్రిల్ 1వ తేదీన రెండో దశ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరగనుంది. బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 8 దశల్లో పోలింగ్‌ను నిర్వహించనున్నారు.