కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కర్ణాటకలో ఆంక్షలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే బెంగళూరులోనూ ఓ వైపు ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ అక్కడి ట్రాఫిక్ పోలీసులు గతేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో ఫైన్లను వసూలు చేశారు. ఈ ఏడాది మే31 వరకు భారీ స్థాయిలో వారు ఫైన్లను వసూలు చేశారు.
మే 31, 2021 వరకు అక్కడి ట్రాఫిక్ పోలీస్ రికార్డుల ప్రకారం.. వారు జనవరి 1 నుంచి మే 31వ తేదీ వరకు రూ.58.90 కోట్లను ఫైన్ల రూపంలో వసూలు చేశారు. 2020 మొత్తం మీద అక్కడ రూ.99.5 కోట్లను వసూలు చేయగా, 2019లో రూ.89.1 కోట్లను వసూలు చేశారు. ఇక 2017లో గరిష్టంగా రూ.112.3 కోట్లను అక్కటి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ల రూపంలో వసూలు చేశారు. అయితే ఈ ఏడాది మే వరకే అంతటి భారీ మొత్తంలో ఫైన్లను వసూలు చేయడం విశేషం.
ఈ సందర్బంగా సిటీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ రవికాంతె గౌడ మాట్లాడుతూ.. మోటారు వాహనాల చట్టం, కర్ణాటక పోలీస్ యాక్ట్, కర్ణాటక ట్రాఫిక్ యాక్ట్‌ల ప్రకారం వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన వారి నుంచి అంత మొత్తంలో ఫైన్లను వసూలు చేశామని తెలిపారు. అయితే వాటిల్లో అత్యధిక భాగం ఫైన్లను లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకే వసూలు చేశామని తెలిపారు. ప్రజలను ఇళ్ల వద్దే ఉండమని చెబుతున్నా కొందరు వినలేదని, అందుకనే అంతటి భారీ మొత్తంలో ఫైన్‌లు వసూలు అయ్యాయని తెలిపారు.
కాగా గత నెలలోనే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సీజ్ చేయబడిన వాహనాలను వెనక్కి ఇచ్చేయాలని అక్కడి హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో మొత్తం 1.50 లక్షల సీజ్ చేయబడిన వాహనాలను పోలీసులు వెనక్కి ఇచ్చేశారు. మొత్తం 1,37,530 టూవీలర్లు, 7,432 ఫోర్ వీలర్లు, 7,123 ఇతర వాహనాలను సీజ్ చేశారు. వాటిని గత నెలలో వెనక్కి ఇచ్చేశారు.