పాకిస్థాన్ ప్రధానిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మన దేశ మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా వెళ్లాడు. అయితే ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సిద్ధూ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. సిద్ధూ అలా చేయడం పట్ల మన దేశంలో తీవ్ర విమర్శలను అతను ఎదుర్కొంటున్నాడు. సిద్ధూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడాన్ని దేశ ద్రోహంగా అభివర్ణిస్తూ బీహార్ లోని ముజఫర్‌పూర్ కు చెందిన న్యాయవాది ఒకరు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిద్ధూపై దేశ ద్రోహం కేసు నమోదైంది.
పంజాబ్ ప్రభుత్వంలో సిద్ధూ మంత్రిగా ఉండగా, తన స్నేహితుడైన ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానం మేరకు అతని ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్థాన్ వెళ్లాడు. అలా సిద్ధూ పాకిస్థాన్ వెళ్లడంతోపాటు అక్కడ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం, వెంటనే పాక్ ఆక్రమిక కశ్మీర్ ప్రాంత అధ్యక్షుడు మసూద్ ఖాన్ పక్కనే కూర్చోవడం వంటి చర్యలను అందరూ తప్పు పడుతున్ఆరు. సాక్షాత్తూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ కూడా దీన్ని ఖండించారు. సిద్దూకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు. ఇక పాక్ పర్యటనతోపాటు, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకోవడం సిగ్గుచేటని బీజేపీ ధ్వజమెత్తింది.
అయితే సిద్ధూ మాత్రం తన చర్యలను తాను సమర్ధించుకున్నారు. గురు నానక్ దేవ్ 550వ ప్రకాష్ పర్వ్ రోజున కర్తార్‌పూర్ సరిహద్దును తెరుద్దాం.. అంటే తాను అంతకన్నా ఏం చేయగలనని అన్నారు. అవసరం వచ్చినప్పుడు తాను అందరి ప్రశ్నలకు బదులిస్తానని చెప్పారు. తనకు సమాధానం ఎలా, ఎప్పుడు చెప్పాలో తెలుసునని అన్నారు.