దేశంలో ఐక్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజాలకు వివరించి ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఏఐసీసీ అగ్ర నేత భారత్ జోడో పాదయాత్ర ను ప్రారంభిస్తున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర సుమారు 150 రోజుల పాటు సాగనుందన్నారు. అక్టోబర్ 24వ తేదీన తెలంగాణ లో మక్తల్ నియోజక వర్గంలో ఈ పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు.
తెలంగాణ లో 13 రోజుల నుంచి 15 రోజుల వరకు పాదయాత్ర సాగనుందని.. జుక్కల్ నియోజక వర్గంలో పాదయాత్ర ముగుస్తుందన్నారు. ఈ పాదయాత్ర విషయంలో ఇప్పటికే రూట్ పరిశీలన జరిగిందన్నారు. 330 నుంచి 370 కిలోమీటర్ల యాత్ర తెలంగాణ లో ఉండే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తి వివరాలు త్వరలో మ్యాప్ లతో సహా విడుదల చేస్తామన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.