ఖమ్మం జనగర్జన సభలో పాల్గొన్న ఆయనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సన్మానించారు. ఆ తరువాత ప్రజలను ఉద్దేశించి భట్టి మాట్లాడుతూ.. పీపుల్ మార్చ్‌లో పాదయాత్రలో తనను అడుగుడుగునా ప్రోత్సహించారని భట్టి తెలిపారు. మాకు ఇల్లు ఇవ్వండి, మీ వెంట నడుస్తామని ప్రజలు అన్నారని ఆయన తెలిపారు. ఉన్నత చదువులు చదివిన వారు, క్రీడాకారులు చిన్న చిన్న పనులు చేయడం ఈ పాదయాత్రలో కనిపించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని మారుస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేస్తామన్నారు భట్టి విక్రమార్క. యువకులు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పంచిన భూములను ఏ ఒక్క ఎకరాను లాక్కున్న చూస్తూ ఊరుకోమన్నారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. ఒక్క ఎకరం కూడా పంచలేదని మండిపడ్డారు. కానీ ఇందిరాగాంధీ హయాంలో దాదాపు 24 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టామని అన్నారు. రాష్ట్ర ప్రజల బాధలను తెలుసుకోవడానికి తాను పీపుల్స్ మార్చ్ చేశానన్న భట్టి.. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.