ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వాసుపత్రులను సందర్శించారు.కొవిడ్ నిర్ధారణ పరీక్షల తీరును అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రుల్లోని లోపాలను బయటకు తీసుకొచ్చేందుకే పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే వైరస్ బారిన పడి ప్రజలు మరణిస్తున్నారని భట్టి ఆరోపించారు.
కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. వైద్యరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఆస్పత్రుల్లోనే వైద్య సిబ్బంది కొరత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అర్హతలేని వైద్యులు సూపరింటెండెంట్‌లుగా కొనసాగుతున్నారని ఆరోపించారు.హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన ప్రవీణ్ యాదవ్ కుటుంబాన్ని భట్టి పరామర్శించారు. ప్రవీణ్ మృతికి ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యారోగ్య శాఖ మంత్రే కారణమని భట్టి ఆరోపించారు.ఈ పర్యటనలో డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.