రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంపై సీఎల్పీ భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తపరిచారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు . అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని అన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామంటున్న ప్రభుత్వం కనీసం నాలుగు గంటలు కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు. నాలుగు గంటలైనా కోతలు లేకుండా చూడాలని కోరారు. ఇదే విషయంపై చర్చ కోసం గొంతు పోయేలా అరిచినా స్పీకర్ పట్టించుకోవడం లేదని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర బడ్జెట్‌పై ప్రజలు పెట్టుకున్న ఆశలను నిరాశపరిచారని, అంకెలు పెద్దగా ఉన్నాయి.. కేటాయింపులు చిన్నగా ఉన్నాయి.. అంటూ భట్టి విక్రమార్క విమర్శించారు. తలసరి ఆదాయం పెరిగిందని ఏ లెక్క ప్రకారం చెప్తున్నారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్రంలో కొంత మంది తలసరి ఆదాయం మాత్రమే పెరిగిందని. పేదలు ఇళ్ళ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారన్నారు. ఆదాని వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థను మోసం చేసిందని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ కార్డు రాష్ట్రంలో ఎక్కడా పనిచేయడం లేదన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో విచ్చలవిడిగా బిల్లులు వేస్తున్నారని, ప్రభుత్వం కట్టడి చేయాలని కోరారు. శ్రీచైతన్య, నారాయణ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు తప్ప.. సరైన వసతులు లేవని భట్టి విక్రమార్క విమర్శించారు. ఆందోళన చేస్తున్నా స్పీకర్ కనీసం తమవైపు చూడటం లేదని అందుకే నిరసన తెలిపుతూ సభ నుంచి బయటకు వచ్చామని వ్యక్తపరిచారు.