భూమా కుటుంబ ప్రతిష్ట మసకబారుతుందా

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి కుటుంబానికి ప్రత్యేకస్థానం ఉంది. భూమా నాగిరెడ్డి, శోభ మృతి తరువాత ఆ కుటుంబం వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. మొన్నటి దాకా ఆళ్లగడ్డ, నంద్యాలకే పరిమితమైన వివాదాలు.. ఇప్పుడు పక్కరాష్ట్రానికి చేరాయి. భూమా కుటుంబానికి ఏమైంది ? హఫీజ్ పేట భూముల వివాదంలో అఖిలప్రియ అరెస్టు చర్చనీయాంశమైంది. భూమా నాగిరెడ్డి కూడా వివాదాస్పదమయ్యారు.. అయితే ఆయన వివాదాల తీరు వేరు.

భూమా నాగిరెడ్డి అనగానే గుర్తొచ్చేది ఫ్యాక్షన్ రాజకీయాలు. సుదీర్ఘ కాలం టీడీపీలోనే ఉన్నా.. ఆ తర్వాత ప్రజారాజ్యం, అక్కడి నుంచి వైసీపీ, తిరిగి టీడీపీలో చేరింది భూమా నాగిరెడ్డి కుటుంబం. 2014 ఎన్నికల సమయంలో భూమా శోభ రోడ్డు ప్రమాదంలో, 2017లో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. భూమా నాగిరెడ్డి దంపతులు మృతి తరువాత.. రాజకీయ పగ్గాలు ఆయన కూతురు అఖిలప్రియ చేపట్టారు. ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టారు. అయితే గత ఎన్నికల్లో భూమా కుటుంబం.. నంద్యాల, ఆళ్లగడ్డలో ఓడిపోయినప్పటి నుంచి అఖిలప్రియను వివాదాలు వెంటాడుతున్నాయి.

భూమినాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డితో అఖిలప్రియకు వివాదాలు మొదలయ్యాయి. అఖిల, ఏవి సుబ్బారెడ్డి మధ్య విబేధాలు ప్రధానంగా ఆర్థికపరమైనవే. నాగిరెడ్డి ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అంతా ఏవి సుబ్బారెడ్డికి తెలుసని, తమకు రావాల్సిన ఆస్తులను ఆయన దాచిపెడుతున్నారనేది భూమా అఖిల అనుమానం. ఇద్దరి మధ్యా విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక సందర్భంలో ఏవి సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేస్తుండగా భూమా అఖిల వర్గీయులు రాళ్ళ దాడి చేశారు. నంద్యాలలో కూడా అఖిలవర్గీయులు , ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు కొట్టుకున్నారు.

అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య విబేధాల్లో అఖిల భర్త భార్గవరాముడు జోక్యంతో వివాదం మరింత ముదిరింది. విబేధాలు ఎంత వరకు దారి తీసాయంటే ఏవి సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నే వరకు వెళ్లాయి. ఏవి సుబ్బారెడ్డి హత్యకు కుట్రను కడప పోలీసులు భగ్నం చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఘటనలో అఖిల భర్త భార్గవ రామునిపై కడప పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భార్గవ రాముడిని అరెస్ట్ చేయాలని పలుసార్లు ఏవి సుబ్బారెడ్డి కడప పోలీస్ అధికారులపై ఒత్తిడి చేశారు.

ఎన్నికల్లో ఓటముల సంగతి ఎలా ఉన్నా.. నంద్యాల, ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి గట్టి పట్టు ఉంది. ఈ ప్రాంతాల్లో భూమా నాగిరెడ్డి సోదరుల కుటుంబాలు, బంధువర్గం, అనుచరవర్గం ఉంది. అయితే ఇటీవల భూమా కుటుంబంలో కూడా విబేధాలు వచ్చాయి. భూమా నాగిరెడ్డి సోదరుని కుమారుడు భూమా కిశోర్ రెడ్డి.. అఖిలప్రియతో విభేదించి బీజేపీలో చేరడంతో ఆ కుటుంబంలో చీలిక వచ్చింది. తాజాగా విజయ డైరీ చైర్మన్ పదవి భూమా కుటుంబంలో మరో చీలికకు దారితీసింది. చైర్మన్ గా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణ రెడ్డి మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు నాగిరెడ్డి తనయుడు జగత్ విఖ్యాత రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే నారాయణరెడ్డి ఇంటికి భార్గవ రాముడు, విఖ్యాత రెడ్డి వెళ్లడంతో విబేధాలు రెచ్చకెక్కాయి. అఖిల సోదరుడు భూమా విఖ్యాత రెడ్డి, భర్త భార్గవ రాముడుపై కేసు కూడా నమోదయింది.

ఆళ్లగడ్డలో కంకర ఫ్యాక్టరీ వివాదంలోనూ భార్గవరామునిపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల సమయంలో కూడా భార్గవ రామునిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా హఫీజ్ పేట భూముల వివాదంతో.. ఏకంగా అఖిలప్రియ అరెస్ట్‌ అయ్యారు. భూమా అఖిలకు , ఏవి సుబ్బారెడ్డి కి కత్తులు దూసుకునేంత వైరం ఉంది. అయితే కిడ్నాప్ వ్యవహారంలో ఇద్దరిపైన కేసు నమోదయింది. ఈ కిడ్నాప్ తో సంబంధం లేదని ఏవి సుబ్బారెడ్డి వాదిస్తుండగా..ఇద్దరూ కలిసిపోయారా అనే చర్చ కర్నూలు జిల్లాలో జరుగుతోంది. మొత్తమ్మీద రాజకీయంగా బలమైన కుటుంబం వివాదాల్లో కూరుకుపోవడం.. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version