జగన్ ప్రభుత్వానికి తొలి ఎదురు దెబ్బ తగిలింది! ఇప్పటి వరకు జగన్ సర్కారును అన్ని విధాలా కాపాడుతూ.. వచ్చిన గవర్నర్ నుంచి ఈ ఎదురు దెబ్బ ఎదురు కావడం.. రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అయినప్పటికీ.. గవర్నర్ వేటితోనూ విభేదించలేదు. ముఖ్యంగా రాజధాని విషయంలో మహిళలు వచ్చి రోదించారు. అయినా .. గవర్నర్ పట్టించుకోలేదు. మూడు రాజధానుల బిల్లుకు ఆయన ఆమోద ముద్ర వేశారు. ఇక, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ జగన్ వైఖరి.. వివాదం అయింది. అయినప్పటికీ.. గవర్నర్ ఆయనకే మద్దతుగా నిలిచారు.
ఇక, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని.. బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగిన సందర్భంలోనూ గవర్నర్ స్పందించలేదు. అదేసమయంలో అనేక విషయాల్లో గత ప్రభుత్వ నిర్ణయాలు తిరగదోడినప్పుడు కూడా గవర్నర్ ప్రశ్నించలేదు. కానీ, హఠాత్తుగా గవర్నర్ యూటర్న్ తీసుకున్నారు. అది కూడా పెద్ద వివాదం కాని విషయంలో.. గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం.. ప్రభుత్వానికి ఇబ్బంది కర పరిణామంగా మారిందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించే ప్రక్రియ విషయంలో ప్రభుత్వం సిఫారసు చేసిన పేరుపై సంతకం చేసేందుకు గవర్నర్ విముఖత వ్యక్తం చేశారు.
అంతేకాదు.. ఫైల్‌ను తిరిగి తీసుకువెళ్లాలని కూడా ఆదేశించారు. సరే! ఇదేమన్నా.. రాజ్యాంగ విరుద్ధమా? గవర్నర్ వెనక్కి తిప్పిపంపారు? అంటే.. కాదు! ఇప్పటి వరకు న్యాయస్థానాలు తప్పుపట్టిన అనేక విషయాలతో పోల్చుకుంటే.. ఇది పెద్ద తప్పుకాదు.. విషయం అంతకన్నాకూడా కాదు. ఎందుకంటే.. వీసీల నిర్ణయంలో ప్రభుత్వం పాత్రను పెంచుతూ.. గత ఏడాది డిసెంబరులోనే జగన్ సర్కారు చట్టసవరణ చేసింది. దీనికి గవర్నర్‌గా విశ్వభూషణ్ ఆమోదముద్ర వేశారు. ఈ ప్రకారమే ఇప్పుడు వీసీల నియామకం చేపడుతూ.. జగన్ సర్కారు నిర్ణయం తీసుకుని ఆయనకు ఫైలును పంపింది.
అయితే.. దీనిని గవర్నర్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ.. వెనక్కి తిప్పారు. ఈ విషయం.. ఎలా ఉన్నా.. గవర్నర్ వ్యవహార శైలిపై మాత్రం ఇప్పుడు రాజకీయంగా చర్చకు వచ్చింది. సీఎంకు.. గవర్నర్‌కు ఏమైనా చెడిందా? అనే కోణంలో నాయకులు చర్చించుకుంటున్నారు. లేదా.. బీజేపీ కిచెందిన వ్యక్తే కనుక.. ఇకపై కఠినంగా ఉండాలంటూ.. కేంద్రం నుంచి గవర్నర్‌కు ఆదేశాలు అందాయా? అనే కోణంలోనూ చర్చ సాగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.