ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిభందనలు అంగీకరించవని మండలి కార్యదర్శి చైర్మన్ కు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకి మీ ఆదేశాలు అమలు కావని మండలి కార్యదర్శి లేఖ రాసారు. దీనితో మళ్ళీ సెలెక్ట్ కమిటీల ఏర్పాటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
సోమవారం ఉదయం నుంచి మండలి కార్యదర్శిని వైసీపీ టీడీపీ ఎమ్మెల్సీలు కలిసారు. ముందు టీడీపీ ఎమ్మెల్సీలు బుద్హా వెంకన్న సహా పలువురు వెళ్లి కార్యదర్శిని కలిసి మండలి ప్రక్రియను ముందుకి తీసుకువెళ్ళాలి అని కోరారు. ఆ తర్వాత వైసీపీ మండలి పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండలి కార్యదర్శితో చర్చలు జరపగా అనంతరం కార్యదర్శి ఈ లేఖ రాసారు.
దీనితో బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్ళే అవకాశం ఉండదని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే మండలి చైర్మన్ సభ్యుల లేఖలను ఇవ్వాలని పార్టీలకు లేఖలు రాసారు. అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినా వైసీపీ ఇవ్వలేదు. కాగా గత నెలలో ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డియే రద్దు బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీకి వెళ్ళిన సంగతి తెలిసిందే. శాసన సభలో బిల్లులు ఆమోదం పొందినా మండలిలో టీడీపీకి బలం ఉండటంతో ఆగిపోయాయి.