మీడియా అంటే.. అంతే.. కొంచెం బాగా కష్టపడి పనిచేస్తున్నారు అని అనుకుంటే.. వారికి ఎక్కువ డబ్బులు జీతం ఇస్తామని ఆశ చూపి తమ సంస్థలోకి లాక్కుంటాయి. తీరా అవసరం తీరిపోయాక.. నువ్వు మాకు అక్కర్లేదు.. పో పోవోయ్.. అంటాయి. అవును.. ప్రత్యేకించి తెలుగు మీడియాలో చాలా మందికి ఈ పరిస్థితి ఎదురవుతోంది. వారిలో చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి కూడా ఒకరు.
బిత్తిరి సత్తి ప్రస్తుతం టీవీ9 ఇస్మార్ట్ న్యూస్‌లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వీ6లో తీన్మార్ షో చేస్తున్న ఆయనకు ఎక్కువ మొత్తంలో ఆశచూపి టీవీ9కు తీసుకువచ్చారు. దీంతో వీ6తో ఉన్న 7, 8 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుని మరీ సత్తి టీవీ9లో ఏడాది కిందట చేరారు. కానీ పలు అనుకోని కారణాల వల్ల ఆయన మంగళవారం టీవీ9 నుంచి వైదొలగారు. ఆ సంస్థకు ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు.
అయితే వ్యక్తిగత కారణాల వల్ల సత్తి తప్పుకున్నారా ? లేక కరోనా వల్ల ఖర్చులకు డబ్బులు లేక ఆదాయం తగ్గించుకునే పనిలో భాగంగా కాస్ట్ కటింగ్ పేరిట సత్తికి టీవీ9 వారు నో చెప్పారా ? అన్న వివరాలు తెలియలేదు. కానీ ఆయన రాజీనామా చేసినట్లు మాత్రం స్పష్టమైంది.
నిజానికి సత్తి ఈ స్థాయికి రావడానికి ఎంతగానో కష్టపడ్డారు. తన దైన శైలిలో హావభావాలను పలికిస్తూ, తన యాసతో ఇటు తెలంగాణ ప్రేక్షకులే కాదు.. యావత్ తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. బిత్తిరి సత్తిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే మీడియా వీ6లో ఆయన మానాన ఆయన ఉంటే అధిక జీతం ఆశ చూపి తీసుకువచ్చి ఇప్పుడు అటు ఇటు కాకుండా చేయడం నిజంగా దారుణమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక టీవీ9 ఇస్మార్ట్ న్యూస్‌లో సత్తి మనకు కనిపించబోవడం లేదు. మరి ఆయన ఇంకేదైనా చానల్‌లో చేరారా, లేదంటే ఇప్పటికింతేనా.. అన్న వివరాలు తెలియాల్సి ఉంది.