బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు-వద్దు బాబోయ్ వద్దు

-

అసెంబ్లీ ఎన్నికల్లో పవర్‌ కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ ఒక్కరిని కూడా గెలిపించుకోలేపోయింది.ఈ నేపథ్యంలో అనేక సవాళ్లను ఆ పార్టీ ఎదుర్కొంటున్నది. గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేక ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు కారు దిగిపోగా మరో ఆరుగురు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.పార్టీని వీడొద్దంటూ వారిని ఎంత బుజ్జగించినా ఎవ్వరూ ఆగట్లేదు.ఫోన్ ట్యాపింగ్ విషయంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందనే ఆందోళన సైతం వెంటాడుతోంది. బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి అన్నది అటుంచితే కాంగ్రెస్ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతోంది. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న కేసీఆర్ కి బీజేపీతో పొత్తు కట్టడం తప్ప మరో మార్గం కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

బీజేపీతో పొత్తు ఉంటే నాయకుల వలసలు ఆగటమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కేసుల బాధ ఉండదు అన్నది బీఆర్ఎస్ ఉద్దేశం.ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ తీసుకురావడం కూడా బీఆర్ఎస్ కు ఛాలెంజ్‌గా మారింది. బీజేపీతో కలిస్తే ఆమెకు ఎలాగోలా బెయిల్ వస్తుంది.అదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి పలు దఫాల్లో బెయిల్ ఇచ్చారు.కానీ కవితకు మాత్రం నిరాశే ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని విలీనం చేస్తే కేంద్రంలో మంత్రిపదవితో పాటు రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పదిలంగా ఉంటుంది.అయితే ఈ ప్రతిపాదనను చాలామంది బీఆర్ఎస్ నాయకులు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు.విలీనం వద్దని కేవలం పొత్తును కొనసాగించాలనే వాదన ఉంది.ఈ నేపథ్యంలో గులాబీ బాస్ కి ఏమి చేయాలో అర్థం కావడం లేదు.

బీఆర్ఎస్ తో పొత్తును బీజేపీనేతలు సైతం వద్దు బాబోయ్ అంటున్నారు.సొంతగా ఎదిగే అవకాశం ఉండగా, బీఆర్ఎస్ ను ఎందుకు మోయటం అన్న అభిప్రాయంతో కొందరు బీజేపీ నేతలు పొత్తులు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాల్సి వస్తే బీఆర్ఎస్ తో బీజేపీ కలిసిరాక తప్పదని, బీజేపీకి గ్రౌండ్ లో అంతగా క్యాడర్ లేదన్న విషయం కూడా మరువరాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.కానీ క్షేత్రస్థాయి కేడర్ మాత్రం బీఆర్ఎస్ తో పొత్తును బలంగా వ్యతిరేకిస్తున్నారు. గులాబీ పార్టీ పాలనలో బీజేపీ కార్యకర్తలను నానా విధాలుగా వేధించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే లాఠీలతో కొట్టించారు.కేసులు పెట్టి అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారు.అప్పటి బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఓ కేసు విషయంలో జైల్ జీవితం గడిపారు. అలాంటి పార్టీతో పొత్తు అవసరం లేదని బీజేపీ కార్యకర్తలు తేల్చి చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version