ఆయనో సీనియర్ నేత. ఒకప్పుడు కేసీఆర్ కి సన్నిహితులు..లోక్‌సభ ఎన్నికల సమయంలో సీఎం స్వయంగా ఆయన ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వనించారు. స్వయంగా ముఖ్యమంత్రే పిలవడంతో ఆయనకు మంచి పదవే ఇస్తారని అనుకున్నారు. రెండేళ్లు కావస్తున్నా సర్కార్ నుంచి ఎలాంటి చప్పుడు లేదు. దీంతో అదే నాయకుడికి కమలదళం గాలం వేస్తుందట.
టీడీపీలో ఉన్న సమయంలో కీలక పదవుల్లో ఉన్నారు మండవ వెంకటేశ్వరరావు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత పొలిటికల్‌గా పూర్తిగా సైలెంట్‌గా ఉంటున్నారు. 2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. సీన్ కట్ చేస్తే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మండవ. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మండవ ఇంటికెళ్లి.. టీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానించారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచీ కేసీఆర్‌తో మంచి సంబంధాలే ఉండటంతో కాదనలేకపోయారు. సైకిల్ దిగి కారెక్కేశారు.
నాటి సన్నివేశాలను చూసినవారంతా మండవకు పెద్ద పదవే దక్కుతుందని అనుకున్నారు. కానీ.. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. పదవీ లేదు.. పాత చింతకాయ పచ్చడీ లేదు. లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓడిపోయారన్న కారణమో ఏమో కానీ.. సీఎం కూడా ఇందూరు జిల్లా నాయకులవైపు పెద్దగా చూసిందీ లేదు. ఆ తర్వాత జిల్లాలో టీఆర్‌ఎస్ పుంజుకోవడంతో మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావులకు పదవులు ఖాయమనే ప్రచారం జోరందుకుంది. మండవను రాజ్యసభకు పంపి.. సురేష్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారని అనుకున్నారు. కానీ.. చివరి నిమిషంలో మారిన రాజకీయ సమీకరణాలతో ఎమ్మెల్సీ బరిలోకి కవిత ఎంట్రీ ఇవ్వడంతో సురేష్‌రెడ్డిని రాజ్యసభకు పంపారు కేసీఆర్.
మండవకు మాత్రం ఎలాంటి పదవీ రాలేదు. ఆయన అనుచరులు సైతం అసంతృప్తితో ఉన్నారట. ఇప్పుడున్న రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మండవను ఎలా అకామిడేట్ చేస్తారన్న చర్చ కూడా టీఆర్‌ఎస్‌లో నడుస్తోందట. జిల్లాలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో టీఆర్‌ఎస్‌ను మరింత శక్తిమంతం చేయాలంటే మండవకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నది పార్టీలో ఓ వర్గం వాదనగా ఉంది. ఇదే సమయంలో పార్టీ మారిపోదామని అనుచరులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారట.
ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు మండవ దూరంగా ఉంటున్నారు. ఒకవేళ DS రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ పదవి మండవకు ఇస్తారన్న టాక్ నడుస్తోంది. DS ఎప్పుడు రాజీనామా చేస్తారన్నది క్వశ్చన్ మార్క్. ఈ పరిణామాలను గమనించిన బీజేపీ పెద్దలు మెల్లగా రంగంలోకి దిగారని సమాచారం. మండవ వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ నేత వస్తే.. పార్టీ మరింత బలపడుతుందనే అంచనాలతో ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించారట. ఒకవేళ అదే నిజమైతే జిల్లా రాజకీయాలు మరోలా ఉంటాయని అనుకుంటున్నారు. మరి.. మండవ ఏం చేస్తారో.. ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటో కాలమే చెప్పాలి.