ప్రపంచ స్థాయిలో కుభేరుడిగా ఉన్న అదానీ కంపెనీలపై నేరుగా పోరుకు సిద్ధం అయింది తెలంగాణ రాష్ట్ర సర్కారు. విద్యుత్ కోతలకు సిసలు కారణంగా వారేనంటూ సీఎం సొంత మీడియాగా వ్యవహరించే కొన్ని సంస్థలు వార్తల రూపంలో వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్న కారణంగా ఎక్కడికక్కడ నిరసన స్వరాలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న నేపథ్యాన సంక్షోభానికి సిసలు కారణం ఏంటన్నది వివరించే ప్రయత్నం ఒకటి చేసేందుకు సిద్ధం అవుతున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు. ఇదే విధంగా కాంగ్రెస్ కూడా ఈ విషయమై కేసీఆర్ కు మద్దతు ఇస్తోంది.
బీజేపీ జేబు సంస్థలుగా పేర్కొనే అదానీ సంస్థల కారణంగానే విదేశీ బొగ్గు దిగుమతులు అన్నవి కనాకష్టంగా మారేయని అంటోంది. ఆస్ట్రేలియాలో గౌతమ్ అదానీకి చెందిన బొగ్గు గనులు కొన్ని ఉన్నాయి. అక్కడి నుంచి దిగుమతి అయ్యే బొగ్గు ఖరీదు చాలా ఎక్కువగానే ఉంటోంది. కానీ కేంద్రం చెబుతున్న విధంగా పది శాతం మేరకు విదేశీ బొగ్గునే వినియోగించాలని ఓ మెలిక ఉండడంతో విద్యుత్ ఛార్జీల పెంపుపైనా మరియు సరఫరాలో అనివార్యమయిన అవాంతరాలపైనా ప్రభావం ఉంటోందని సీఎం కేసీఆర్ వర్గాలు ప్రజలకు వివరించే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు.
ఇప్పటికే పలుమార్లు విదేశీ బొగ్గు అన్నది చాలా ఖరీదుగా ఉంది. దేశీ య మార్కెట్ కన్నా నాలుగు రెట్లు అధికంగా ఉంది. దీంతో దిగుమతుల వ్యవహారం భారంగా ఉంది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా కేంద్రం కొన్ని నిబంధనలు విధిస్తోందని కాంగ్రెస్ కూడా కేసీఆర్-తో గొంతు కలిపే మాట్లాడుతోంది. దీంతో థర్మల్ పవర్ స్టేషన్లలో తరుచూ బొగ్గు కొరత ఏర్పడుతోంది. వేసవి కావడంతో జలవిద్యుత్ ఆశించిన స్థాయిలో లేదు. అందుకే ప్రత్నామ్నాయ పద్ధతుల్లో విద్యుత్ ఉత్పత్తికి (సౌర, పవన) ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచిస్తున్నారు కేసీఆర్. వాస్తవానికి అదానీ గ్రూపునకు చెందిన సోలార్ పవర్ కొనుగోలు చేయాలన్నా ధర అధికంగానే ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోతలు అనివార్యం అయి ఉంటున్నాయని, అయినా వీటిని అధిగమించేందుకు తాము కృషి చేస్తున్నామని అంటోంది టీఆర్ఎస్.