ఏపీలో వరుసగా నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు అత్యాచార ఘటనలతో తలలు పట్టుకుంటున్న అధికార యంత్రాంగంకు ఏపీలో హత్య కేసులు మరో సమస్యగా మారాయి.. సత్యసాయి జిల్లాలోని వానవోలు గ్రామానికి చెందిన చాకలి ఈశ్వరమ్మ (42) భర్త చాకలి కుళ్లాయ్యప్ప పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆమె అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈశ్వరమ్మ కుమారుడు పవన్‌కు కొంత కాలం క్రితం వివాహమైంది. అతని భార్య ఇటీవల పుట్టినింటికి వెళ్లింది. అయితే ఈ నేపథ్యంలో.. వివాహేతర సంబంధం మానుకోవాలని తల్లికి పవన్ అనేక సార్లు నచ్చ జెప్పాడు. అయినప్పటికీ ఈశ్వరమ్మ పెడచెవిన పెడుతూ వచ్చింది. ఈ విషయంపై మంగళవారం రాత్రి తల్లీకొడుకు మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలో పవన్‌పై తల్లి ఇటుకతో దాడి చేయడానికి ప్రయత్నించగా.. అతను ఆగ్రహానికి గురై కట్టెతో కొట్టి, బండరాయితో మోది చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి ఇంటికి సమీపంలోని మొక్కజొన్న చేనులో పడేశాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీఐ జయనాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తల్లిని తానే చంపినట్లు పవన్ అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.