సాగర్‌ అభ్యర్థి విషయంలో బీజేపీ డిఫెన్స్ లో పడిందా ?

-

నాగార్జునసాగర్‌లో అభ్యర్థి విషయంలో బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతుందా..సరైన అభ్యర్ది కోసం కొనసాగిన వేట ఫలితాన్నివ్వలేదా..తెర పైకి విజయశాంతి పేరు రావడం ప్యూహమా లేక గందరగోళమా.. ఎవరిని బరిలో దించితే ఫలితం అనుకూలంగా ఉంటుందన్న దాని పై స్పష్టం లేదా..సాగర్‌ అభ్యర్థి విషయంలో బీజేపీ డిఫెన్స్ లో పడిందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి పేరు ఖరారు కావడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవశం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. బీజేపీ ఆలోచనలు కూడా ఇలాగే సాగుతున్నాయి. ఎవరిని బరిలో దించితే ఫలితం అనుకూలంగా ఉంటుందోనని సర్వేలు.. రీసర్వేలు చేయిస్తున్నారు కమలనాథులు.

అభ్యర్థి ఎవరన్నది అధిష్ఠానం ప్రకటించక పోయినా.. తానే క్యాండిడేట్‌ అని చెప్పుకొంటూ 2018 ఎన్నికల్లో పోటీ చేసిన నివేదిత రెడ్డి ప్రచారం ప్రారంభించేశారు. నివేదిత భర్త శ్రీధర్ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కావడంతో ప్రచార రథాలను తయారు చేయించి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఇతర పార్టీల నేతలను ఆహ్వానించి కాషాయ కండువా కప్పేస్తున్నారు నివేదిత. 2018 ఎన్నికల్లో ఓడినా.. నియోజకవర్గాన్నే అట్టిపెట్టుకుని ఉన్న విషయాన్ని పదే పదే రాష్ట్ర నాయకుల ముందు ప్రస్తావిస్తున్నారు.

2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. ఇప్పుడు బీజేపీలో ఉన్న కడారి అంజయ్య సైతం టికెట్‌ ఆశిస్తున్నారు. కాకపోతే ఆయనది నాగార్జునసాగర్‌ కాదు. దేవరకొండ నియోజకవర్గం ఆయన భార్య అక్కడే పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో భార్యను సర్పంచ్‌గా గెలిపించుకోలేని వ్యక్తి ఉప ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారని బీజేపీలోని కొందరు ప్రశ్నిస్తున్నారట. పార్టీలో ప్రత్యర్థులే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్న అంజయ్య.. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అనుచరులతో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తూ… ప్రచార రథాలను తిప్పుతూ సాగర్‌ను ఊదరగొడుతున్నారు.

నివేదిత, అంజయ్యలు ఒకవైపు టికెట్‌ కోసం పోటీ పడుతుంటే.. రాష్ట్ర నాయకత్వం ఆలోచన మరోలా ఉంది. వీరిద్దరు కాకుండా మరో బలమైన అభ్యర్థి కోసం వడపోతలు మొదలుపెట్టిందట. బరిలో జానారెడ్డితోపాటు అధికార పార్టీ అభ్యర్థి ఉంటారు. రెండు బలమైన శక్తులను ఢీకొట్టాలంటే అంతకంటే బలంగా ఫైట్‌ చేయాలన్నది కమలనాథుల ఆలోచన. అందుకే నివేదిత, అంజయ్యల బలం వారి ముందు సరిపోదని అనుకుంటున్నారట. ఇప్పుడిప్పుడే కొత్త పేరు కూడా బీజేపీలో వినిపిస్తోంది.

కాంగ్రెస్ నుంచి ఇటివలే పార్టీలో చేరిన సినీ నటి విజయశాంతిని సాగర్ బరిలో దింపే విషయాన్ని బీజేపీ నాయకత్వం పరిశీలిస్తోంది. విజయశాంతి ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని నల్గొండ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు.. పార్టీ నాయకత్వానికి సూచించారు. సినీగ్లామర్‌కుతోడు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విజయశాంతి చేస్తున్న విమర్శలు తమకు కలిసొస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయమై కమళనాథులు అంతర్గతంగా ఓ సర్వేకూడా నిర్వహిస్తున్నారు.

మరోవైపు టీఆర్‌ఎస్‌ క్యాండిడేట్‌ ఎవరన్నది తేలిన తర్వాతే బీజేపీ ప్రకటన ఉంటుందట. అయితే ఆ వ్యక్తి నాగార్జునసాగర్‌కు చెందినవారేనా కాదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

Read more RELATED
Recommended to you

Exit mobile version