మహారాష్ట్ర కేబినెట్ విస్తరణలో ముసలం.. రెండు నెలలకే లుకలుకలు

-

మహారాష్ట్రలో కొత్త సంకీర్ణ కూటమి(భాజపా, అసమ్మతి శివసేన) ప్రభుత్వం ఏర్పడిన ఆరువారాల తర్వాత కేబినెట్ విస్తరణ జరిగింది. చెరో పార్టీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, ఇందులో అసమ్మతి వర్గ శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ రాఠోడ్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై భాజపా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ మహిళను ఆత్మహత్యకు పురిగొల్పాడనే ఆరోపణలతో గత ఏడాది సంజయ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత శివసేనలో అసమ్మతికి నేతృత్వం వహించిన ఏక్‌నాథ్ శిందే క్యాంపులో చేరారు. తాజాగా మంత్రి పదవిని దక్కించుకున్నారు.

దీనిపై మహారాష్ట్ర భాజపా ఉపాధ్యక్షురాలు చిత్రా వాఘి ..ట్విటర్ వేదికగా ఆయన నియామకాన్ని నిరసించారు. ‘ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా.. నేను నా పోరాటం కొనసాగిస్తాను. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. మేం పోరాడి గెలుస్తాం’ అని ఆమె వెల్లడించారు.

అయితే ఈ నియామకాన్ని ముఖ్యమంత్రి శిందే సమర్థించారు. మునుపటి ప్రభుత్వ హయాంలో ఆయనపై విచారణ జరిగింది. అనంతరం పోలీసులు క్లీన్‌ చిట్ ఇచ్చారు. అందుకే మంత్రిగా ఎంపిక చేశాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారితో మాట్లాడతాం’ అని శిందే బదులివ్వడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఈ సమయంలో గత ఏడాది భాజపా నేత కిరీట్‌ సోమయ్య చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అది సంజయ్ కారణంగా జరిగిన ఆత్మహత్య కాదు.. హత్య అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారందులో. కానీ ఇప్పుడు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆరోపణలపై ఏ విధమైన వ్యాఖ్యా చేయలేదు.

యావత్మల్‌లోని దిగ్రాస్‌ నియోజకవర్గానికి చెందిన సంజయ్ రాఠోడ్‌తో మృతురాలికి సంబంధం ఉందని, అది బెడిసికొట్టి ఆమె ఆత్మహత్యకు దారితీసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ కారణంగా ఆయన రాజీనామాచేయాల్సి వచ్చింది. శిందే మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్న ఊహాగానాల మధ్య ఆయనకు లభించిన క్లీన్‌చిట్ గురించి గతనెల శిందే ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version