రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు సీనియర్ అంటూ జై కొట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ ధైర్యంతో ప్రధాని మోడీని సైతం తీవ్రంగా విమర్శించారు. అనంతరం బాబు హ్యాండ్ ఇచ్చారని కథనాలు రావడం.. వాటిని నిజం చేస్తూ పవన్ – బాబు బంధం విడిపోవడం.. ఫలితంగా 2019 ఎన్నికల్లో పవన్ ఒంటరిగా పోటీచేయడం తెలిసిందే. అనంతరం వచ్చిన ఫలితాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే పరిస్థితి జనసేనకు మిగిలింది. ఆ సంగతులు అలా ఉంటే… ప్రస్తుతం బీజేపీతో దోస్తీ కట్టిన జనసేనాని రాక ఆ పార్టీలో ఎంతమందికి ఇష్టం.. మరెంతమందికి అయిష్టం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కేవలం కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడానికే పవన్ తో బీజేపీ జతకట్టింది అని భావిస్తే… అందుకు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులు ఉన్నారు! అలా కాకుండా ఒక మాస్ లీడర్ అనే ఉద్దేశ్యంతో.. జనాలకు ఆకర్షించగలిగే నేత.. భవిష్యత్తులో బీజేపీకి తురుపుముక్క అని భావించే గనుక పవన్ తో దోస్తీ కట్టి ఉంటే… అది ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాష్ట్ర స్థాయి నేతల్లో ఎంతమందికి ఇష్టం.. మరెంత మందికి అయిష్టం!! ఈ ప్రశ్నలు ఉత్పన్నమవ్వడానికి గల కారణం… జనసేనను కలుపుకుపోవడంలో ఏపీ బీజేపీ నేతలు ఏమాత్రం ఉత్సాహం చూపించకపోవడమే!
జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ ప్రధాన అంశాల్లో, రాజకీయంగా లబ్ధి చేకూర్చే విషయాల్లో ఆ పార్టీని ఏపీ కమలనాథులు కలుపుని పోయే పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పొత్తు పొడిచిన అనంతరం ఇప్పటివరకూ.. బీజేపీ – జనసేన ల ఉమ్మడి ఉద్యమాలు ఒక్క టిటిడి ఆస్తుల అమ్మకంలో తప్ప మరెక్కడా కనిపించలేదు అనేది స్పష్టం! మద్యం పాలసీ, ఇసుక సమస్య, విద్యుత్ బిల్లులు పెంపు.. ఇక రాజకీయంగా వైకాపా రంగుల వ్యవహారం, కోర్టుల జోక్యం వంటి అనేక అంశాల్లో ప్రభుత్వ విధానాలు ఎండగట్టడంలో రెండు పార్టీలు కలిసి ఒకే తాటిపైకి వచ్చి స్పందించలేకపోతున్నాయి.
దానికి కారణం గ్రౌండ్ లెవల్ లో జనసేన కార్యకర్తలు.. “బీజేపీ ని కలుపుకుపోవడం” లేకపోవడమే. ఇప్పటికే కరోనా సహాయ కార్యక్రమాల్లో స్వయంగా పవన్ చెప్పినా కూడా కార్యకర్తలు ఆ పనికి పూనుకోలేదు! ఇదే క్రమంలో… రాష్ట్రస్థాయిలో పెద్ద నేతలు ఎవరూ పవన్ ను కలుపుకుపోవడం లేదు అని తెలుస్తుంది. దానికి.. బాబుతో వారికున్న రహస్య స్నేహమే కారణం అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే… బీజేపీ – జనసేనల అధినేతలు ఒకటి ఊహిస్తే.. గ్రౌండ్ లెవల్ లో మరొకటి జరుగుతుందన్న మాట! మరి ఈ అతుకుల కాపురం ఎప్పటికి సెట్ అవుతుందో వేచి చూడాలి!!