పార్లమెంటరీ బోర్డులో లక్ష్మణ్‌కు స్థానం

-

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు పార్టీలో కీలక స్థానం లభించింది. భాజపాలో అత్యున్నత నిర్ణయాత్మక మండలి పార్లమెంటరీ బోర్డులో అధిష్ఠానం ఆయనకు అవకాశం కల్పించింది. ఈ బోర్డులో తెలంగాణకు తొలిసారి నేరుగా ప్రాతినిథ్యం లభించింది. 2020 అక్టోబరులో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఆయన్ను నియమించిన అధిష్ఠానం.. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకూ పంపింది. తాజాగా పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పార్లమెంటరీ బోర్డులోకి ఆయన్ను తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యం, సామాజిక సమీకరణాల కోణంలో కమలదళం ఆయన్ను వ్యూహాత్మకంగానే బోర్డులోకి తీసుకుందని పార్టీ వర్గాల సమాచారం.

పార్లమెంటరీ బోర్డులోకి తనను తీసుకోవడాన్ని కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం దక్షిణాదిపై, మరీ ముఖ్యంగా తెలంగాణపై దృష్టి సారించిందని.. అందులో భాగంగానే తనకు ఈ అవకాశం కల్పించినట్లు భావిస్తున్నానని’ ఆయన తెలిపారు.

పార్లమెంటరీ బోర్డులో లక్ష్మణ్‌కు చోటు కల్పించడం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కీలక కమిటీల్లో తెలంగాణ బిడ్డకు అవకాశం దక్కడం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version