హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఏపీ, తెలంగాణలో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తెలంగాణలో ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తుండటంతో ఏపీలో కూడా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. వచ్చే సాధారణ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ అధికార పార్టీని ఢీకొట్టేలా ప్రిపేర్ చేస్తోంది. ఇందుకు కొత్త ఇంచార్జిని నియమించింది.
తెలంగాణలో పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు నేత ఉన్నా పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కీలకంగా పని చేసిన పార్టీ ఆర్గనైజింగ్ సహకార్యదర్శి ప్రకాశ్‌ను తెలుగు రాష్ట్రాలకు పంపింది. ఆయన కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ కూడా హాజరుకానున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, మరింత బలపడే అంశాలపై ప్రకాశ్ చర్చించనున్నారు. ఈటల చేరిక, పార్టీ వ్యూహంపైనా చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్ రావు, లక్ష్మణ్ పాల్గొననున్నారు. త్వరలో ఏపీ బీజేపీ నేతలతోనూ ప్రకాశ్ భేటీకానున్నారని సమాచారం.