హైదరాబాద్‌లో ఛార్మినార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు…ఛార్మినార్ కట్టడానికి గాని, ఆ ప్రాంతానికి గాని ప్రత్యేక చరిత్ర ఉంది. ఆ చరిత్రని కాసేపు పక్కన పెడితే ఛార్మినార్ నియోజకవర్గానికి ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉంది. 1967లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక ముస్లిం అభ్యర్ధి మాత్రమే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఛార్మినార్ ప్రాంతంలో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువ.
అయితే 1989 నుంచి ఇక్కడ ఎంఐఎం పార్టీ ఏకధాటిగా విజయం సాధిస్తూ వస్తుంది. 1994, 1999 ఎన్నికల్లో ఇక్కడ నుంచి అసదుద్దీన్ విజయం సాధిస్తూ వచ్చారు. ఇక 2004 నుంచి 2014 వరకు సయ్యద్ అహ్మద్ పాషా గెలిచారు. 2018 ఎన్నికల్లో అహ్మద్ ఖాన్ విజయం సాధించారు. ఇలా ఛార్మినార్ పూర్తిగా ఎంఐఎం కంచుకోటగా ఉంది. ఇక్కడ ఎవరిని నిలబెట్టిన సరే ఎంఐఎం విజయం ఖాయం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.
అయితే అలాంటి ఎంఐఎం కంచుకోటని బద్దలుగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంపై ఫోకస్ చేసి పనిచేస్తుంది..ఈ సారి టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇదే క్రమంలో ఎంఐఎం బలంగా ఉన్న పాతబస్తీపై ఫోకస్ పెట్టింది. పాతబస్తీలో బీజేపీ బలంగా ఉండే స్థానం ఒక్క గోషామహల్ మాత్రమే. కానీ ఈ సారి పాతబస్తీలో సత్తా చాటాలని బీజేపీ చూస్తుంది.
గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నేత ఉమా మహేంద్రపై 32 వేల మెజారిటీతో ఎంఐఎం గెలిచింది. కానీ ఈ సారి ఎంఐఎం బలం తగ్గించడానికి బీజేపీ చూస్తుంది. ఇక్కడ పుంజుకుని ఈ సారి ఎలాగైనా ఛార్మినార్‌ని దక్కించుకోవాలని చూస్తుంది. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా మహేంద్ర బీజేపీ నుంచి బరిలో ఉండనున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఓటు బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ వీక్ అవుతున్న నేపథ్యంలో ఆ ఓటు బ్యాంకుని బీజేపీ వైపుకు తిప్పుకుంటే ఛార్మినార్‌లో ఎంఐఎంకి గట్టి పోటీ ఇవ్వొచ్చు. కానీ ఛార్మినార్‌లో ఎంఐఎంని ఓడించడం అంత సులువు కాదు. చూడాలి మరి ఈ సారి పోటీ ఎలా ఉంటుందో.