మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు చేస్తున్నవి దొంగ నిద్రలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వికారాబాద్ , నల్గొండ , హైదరాబాద్ ప్రజలు మూసీ కంపులోనే బతకాల అంటూ? ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు నిద్ర కాదు.. 3 నెలల పాటు అక్కడే ఉండాలని బీర్ల ఐలయ్య సవాల్ విసిరారు.
ఇదిలాఉండగా, సీఎం రేవంత్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒక్క రోజు నిద్రించిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం 4 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని సుమారు 20 బస్తీల్లో బీజేపీ ముఖ్య నేతలు బస్తీవాసులతో కలిసి అక్కడే నిద్రించారు. నిద్రించిన వారిలో జి.కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్ , ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి,సీతారాం నాయక్ , ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లు ఉన్నారు.