నిన్న తనపై, రైతులపై జరిగిన దాడికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం కారణమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. రైతులతో మాట్లాడితే కోడిగుడ్లు, రాళ్లు విసిరారని టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వెల్లగక్కారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతులు దసరా, దీపావళి పండగలు లేకుండా కల్లాల దగ్గర పడిగాపులు కాస్తున్నారని అన్నారు. వానాకాలం పంటను త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సమస్యలను పరిష్కరించే ఉద్దేశం లేదని ఆయన అన్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటే కోడిగుడ్లతో దాడులు చేస్తున్నారన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్.
బీజేపీ పార్టీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతున్నారన్నారు. మేము ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని అన్నారు. మీ కుటుంబాన్ని వదిలేది లేదని హెచ్చరించారు. సీఎం ఫామ్ హౌజ్ కు పరిమితమ్యారని.. మీరు చేయవల్సిన పనిని మేము చేస్తున్నామని అన్నారు. 8 రాష్ట్రాలు ధాన్యం సేకరణ చేస్తుంటే రాని సమస్యలు తెలంగాణలో ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.
నిన్న జరిగిన ఘటనపై బీజేపీ నాయకులు రాష్ట్ర గవర్నర్ తమిళి సైని కలువనున్నారు. బీజేపీ నాయకులపై జరిగిన దాడిపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.