పీఎఫ్ఐ బ్యాన్ పై బీజేపీ, మిత్రపక్షాలు హర్షం

-

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా – పీఎఫ్​ఐ, అనుబంధ సంస్థలపై నిషేధాన్ని బీజేపీ, మిత్రపక్షాలు స్వాగతించాయి. దేశంలో విద్వేష భావాలు ప్రేరేపిస్తున్నందునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాలు దేశంలో మనుగడ సాధించలేవని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.

పీఎఫ్​ఐపై నిషేధం విధించాలని వామపక్షాలతో పాటు కాంగ్రెస్ కూడా సుధీర్ఘకాలంగా డిమాండ్ చేస్తోందని కర్ణాటక సీఎం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సరైన నిర్ణయం తీసుకున్నారని బొమ్మై కితాబిచ్చారు. నూతన భారతావనిలో దేశభద్రతకు సవాల్ విసిరే తీవ్రవాదులు, నేరస్థులు, వ్యక్తులను అనుమతించే ప్రసక్తేలేదని.. ఉత్తర్​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టంచేశారు. పీఎఫ్​ఐ జాతి వ్యతిరేక కార్యకలాపాలను ఖండించిన ఆయన నిషేధాన్ని స్వాగతించారు.

పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించాలని ఉత్తర్​ప్రదేశ్ మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి డానిష్ అజాద్ అన్సారీ సూచించారు. దేశంలో విధ్వంసం సృష్టించేవారు ఎవరైనాసరే.. ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసేందుకు కట్టుబడి ఉంటుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్వ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version