ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే మంగళవారం అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమానికి తెలుగుదేశానికి పార్టీ మద్దతు ప్రకటించడమే కాకుండా రైతుల వద్దకు వెళ్లి నిరసనలో పాల్గొనాలని భావించింది. దీనిని పోలీసులు అడ్డుకున్నారు.
పలువురు నేతలను ముందుగానే హౌస్ అరెస్ట్ లు చేసారు పోలీసులు. ఈ నేపధ్యంలో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమను కూడా బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఉమాకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బొండా పోలీసుపై రెచ్చిపోయారు. తన ఇంటి వద్దకు వచ్చిన పోలీసులపై ఆయన బూతులతో విరుచుకుపడ్డారు.
ఎవడు అంటూ డ్యూటిలో ఉన్న పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. అదే విధంగా నువ్వు ఎవడు నువ్వు ఎవడు అంటూ ఎదురు ప్రశ్నించారు. అలాగే చొక్కాలు విప్పిస్తాం ఎవడి డ్యూటి వాడు చేసుకోండి అంటూ పోలీసులను ఉద్దేశించి బొండా చెలరేగిపోయారు. తన గుమ్మంలోకి రావొద్దని హెచ్చరిస్తూ మాట్లాడారు. నా ఇల్లు ఇది నా ఇల్లు ఇది అంటూ రెచ్చిపోయారు బొండా. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.