చీపురుపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ను ఆశిస్తున్నారు అక్కడి నియోజకవర్గ ప్రజలు. టీడీపీ సైతం బొత్సను ఇదే విషయమై టార్గెట్ చేస్తోంది. ఈ నియోజకవర్గానికి బొత్స సత్యనారాయణ (పురపాలక శాఖ మంత్రి) సారథ్యం వహిస్తున్నారు. తిరుగులేని నేతగా ఉన్నారు. అయినా కూడా ఆయన అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఒప్పించలేకపోయారు అన్న అపవాదును ఎందుకనో మూటగట్టుకుంటున్నారు.
ఈ విషయమై ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఎందుకూ అక్కరకు రాకుండా పోయిందన్న వాదన కూడా వినిపిస్తోంది. దశాబ్దాల తరబడి రాజకీయ రంగంలో తిరుగులేని రాజసంతో ఉన్న బొత్స ఇవాళ ఎందుకనో వెనుకబడి పోతున్నారు. ముఖ్యంగా జగన్ దగ్గర ఆయన ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయిందన్న మాటకు అనుగుణంగానే వర్తమాన పరిణామాలు నెలకొని ఉంటున్నాయి.ఒకప్పుడు అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకునే బొత్స ఇవాళ మాత్రం చతికిలపడుతున్నారు. క్యాడర్ పై కూడా పట్టు కోల్పోతున్నారు.
ఇదే సందర్భంలో కుటుంబ కలహాలు కూడా ఆయనను వేధిస్తున్నాయి.క్యాబినెట్ నుంచి త్వరలో ఆయనను తప్పించనున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో క్రియాశీల రాజకీయ వ్యవహారాలు చూసే బృందానికి వైస్సార్సీపీ తరఫున ఆయన సారథ్యం వహిస్తారు అని ఓ ప్రాథమిక సమాచారం. ఇందుకు జగన్ కూడా ఆయనకు మార్గ నిర్దేశం చేశారని సమాచారం. ఒకవేళ జగన్ మంత్రివర్గంలో ఆయనను కొనసాగించినా ఇప్పటిలానే పరిమిత అధికారాలతోనే నెగ్గుకు రావాలి తప్ప చీపురుపల్లి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం అన్నది జరగని పని అని తేలిపోయింది. దీంతో ఆయన తీవ్ర నిర్వేదంలోనూ మరియు నిరాశలోనూ ఉన్నారని తెలుస్తోంది. ఒకానొక దశలో ఆయన పార్టీ వీడిపోవాలని కూడా అనుకున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో కొత్త కుర్రాడు తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి అందుకున్న సీదిరి అప్పల్రాజు దూసుకుపోతున్నారు. మత్స్యకార శాఖ మంత్రిగా సొంత సామాజికవర్గానికి చేయాల్సిన మంచి చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా పలాస నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.ఇప్పటికే ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సమ్మతించారు. పలాస కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయితే ఇక్కడి ప్రజల సుదీర్ఘ కాలం నాటి కల
నెరవేరేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే సంబంధిత కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి భవనాల పరిశీలన కూడా పూర్తైంది. అన్నీ బాగుంటే ఈ ఉగాది నాటికే పలాస రెవెన్యూ డివిజన్ ఆరంభం అయ్యేందుకు అవకాశాలున్నాయి. అదే కనుక జరిగితే నియోజకవర్గంలో సీదిరి అప్పల్రాజు మాటకు ఇక తిరుగుండదు.ఎదురుండదు.
– డిస్కషన్ పాయింట్ – మన లోకం ప్రత్యేకం