ప్రతి అంశం బీజేపీకి చెప్పి చేయాల్సిన అవసరం మాకు లేదు : బొత్స

-

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలవడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎవరైనా కలవొచ్చని బొత్స అన్నారు. తమ బాధలను అమిత్ షాకు చెప్పుకునేందుకు లోకేశ్ కలిసి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పై చాడీలు కూడా చెప్పి ఉంటాడని అన్నారు. అమిత్ షా వద్దకు పురందేశ్వరి, లోకేశ్ కలిసి వెళ్లారో, విడివిడిగా వెళ్లారో తమకు అవసరం లేదని అన్నారు. టీడీపీకి రాష్ట్రంలో ఏపీ బీజేపీ బీ టీమ్ అని బొత్స అభివర్ణించారు. బీజేపీకి ప్రతి అంశం చెప్పి చేయాల్సిన అవసరం తమకు లేదని బొత్స స్పష్టం చేశారు. విశాఖకు వెళ్లే అంశంపై తాము జీవో కూడా ఇస్తే, దొడ్డిదారి ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. విశాఖతో పాటు కడపలోనూ సీఎంకు క్యాంపు కార్యాలయం ఉందని వివరించారు.

కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టారాజ్యంగా మాట్లాడటం అలవాటుగా మారిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమన్నారు. ప్రజల కోసమో, రాజకీయం కోసమో ఆలోచించుకుని మాట్లాడాలని మంత్రి సూచించారు. ఈ ప్రభుత్వ ప్రాధాన్యత విద్య అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. సెలబ్రిటీ పార్టీ నాయకుడు బైజూస్ మీద మాట్లాడారని.. బైజూస్‌పై స్టడీ చేసి మాట్లాడమని చెప్పానని ఆయన తెలిపారు. బైజూస్ కంటెంట్‌ను ఆ సంస్థ ఫ్రీగా ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఆ మేరకే ఒప్పందం చేసుకున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా బైజూస్ సంస్థకు ప్రభుత్వం చెల్లించటం లేదని పేర్కొన్నారు. బైజూస్ కంటెంట్‌తో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు సుమారుగా 5 లక్షలకు పైగా ట్యాబ్స్ అందించామన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇచ్చే ట్యాబ్స్‌లో 8,9,10 తరగతుల కంటెంట్ వేసి ఇస్తున్నామన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version