ఏపీ ప్రభుత్వం – ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మధ్య ఏర్పడిన అగాధం అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఆయన మీద ఏపీ మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. ఏపీ గవర్నర్ బిశ్వ భూషన్ హరి చందన్ కు సలహాలు ఇచ్చే స్థాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చెబితే అదే చేస్తున్న నిమ్మగడ్డకు గవర్నర్ కు సలహాలు ఇచ్చే స్థాయి అస్సలు లేదని అన్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన నిమ్మగడ్డకు ఎన్నికల బాధ్యత ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. కరోనా దృష్ట్యా ఎన్నికలు సాధ్యం కాదని అసెంబ్లీలో తీర్మానం చేశామన్న మంత్రి జనవరిలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, అలా ఒకవేళ వచ్చినా సరే ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు 2, 3 నెలల సమయం పడుతుందని చెప్పారు. అందుకే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తీర్మానం చేశామని మంత్రి పేర్కొన్నారు.