- మిత్ర దేశాలకు ఉచితంగానే టీకాలు అందిస్తున్న భారత్
- తాజాగా బ్రెజిల్‌కు రెండు మిలియన్ల డోసులు ఎగుమతి
- ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అధ్యక్షుడు బోల్సోనారో
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే అక్కడి వారిని కరోనా నుంచి రక్షించడానికి హనుమంతుడు కోవిడ్-19 టీకాలను తీసుకెళ్తున్నాడు ! అది కూడా భారత్ నుంచి ! అవును నిజమే మీరు చదివింది.. ! అది ఎక్కడ? ఎలా? అనే కదా మీ ప్రశ్న!
తాజగా భారత్.. బ్రెజిల్‌కు కరోనా టీకాలను విమానం ద్వారా పంపించింది. ఈ క్రమంలోనే బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి బోల్సోనారో చేసిన సోషట్ మీడియా ట్వీట్ సర్వత్రా ఆసక్తిని కలిగించడంతో పాటు ప్రధాని మోడీ సైతం దీనికి ఫిదా అయ్యారు. అంత స్పేషల్ ఏంటనే కదా మీ ప్రశ్న !
బోల్సీనారో తన ట్వీట్ లో ”నమస్తే ప్రధాని నరేంద్ర మోడీ జీ. కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి బ్రెజిల్ ఒక గొప్ప అంతర్జాతీయ భాగస్వామిని (భారత్) కలిగి ఉండటం గౌరవంగా భావిస్తుంది. కరోనా టీకాలు భారత్ నుంచి బ్రెజిల్‌కు పంపించి.. మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు. దీనికి భారతీయులు అత్యధికంగా ఆరాధించే హనుమంతుడు టీకాలు మోసుకెళ్తున్నట్టుగా ఉన్న ఫోటోను సైతం బోల్సోనారో ట్యాగ్ చేశారు. సంబంధిత ఫోటో భారతీయ అరాధ్యదైవమైన రాముని చరిత్రను తెలిపి పురాతన ఇతిహాసమైన రామాయణంలోని ఓ సంఘటనను గుర్తుచేసేది కావడంతో ప్రధాని మోడీతో పాటు యావత్ భారతావని కూడా ఆయన ట్వీట్‌పై హర్షం వ్యక్తంచేస్తోంది.
కాగా, స్వదేశీ టీకాను అభివృద్ధి చేసి అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న భారత్ పైపు యావత్ ప్రపంచం చూస్తోంది. టీకాలు భారత్ నుంచి తీసుకోవడానికి అనేక దేశాలు ఒప్పందం చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. అయితే, భారత్ తన మిత్ర దేశాలతో ఉన్న స్నేహ బంధానికి గుర్తుగా కోవిడ్-19 టీకాలను ఉచితంగానే అందిస్తూ అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తోండటంతో భారత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ వారం ప్రారంభం నుంచే ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపిణీని భారత్ ప్రారంభించింది. దీనిలో భాగంగా భూటాన్, నేపాల్, మల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్, షీసెల్స్ దేశాలకు టీకాలను పంపించింది. తాజాగా బ్రెజిల్‌కు 2 మిలియన్ డోసులను ఎగుమతి చేసింది భారత్.