తెలంగాణాలో లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. లాక్ డౌన్ విషయంలో ఇప్పటికే తన వైఖరి చెప్పిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు లాక్ డౌన్ ని పొడిగించే విషయంలో కేబినేట్ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. రేపు తెలంగాణా కేబినేట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కేబినేట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దీనిపై మంత్రుల అభిప్రాయాలు తీసుకుని కేసీఆర్ నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాలు లాక్ డౌన్ ని ప్రకటించాయి. పంజాబ్, ఓడిస్సా రాష్ట్రాలు దీనిపై నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం తో సంబంధం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
రెండు రాష్ట్రాల్లో కేసులు తక్కువగానే ఉన్నా మరో మాట లేకుండా ముందుకి వెళ్ళారు. తెలంగాణాలో కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 12 మంది మరణించగా 471 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 45 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక లాక్ డౌన్ ని మరికొంత కాలం పొడిగిస్తే మంచిది అనే భావనలో ఉన్నారు. ఇప్పుడు సడలిస్తే ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని కెసిఆర్ ఆందోళనలో ఉన్నారు.