దేశంలోని వాహన విక్రయదారులకు సుప్రీం కోర్టు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్ 6 ప్రమాణాలు ఉన్న వాహనాలనే విక్రయించాలని గతంలో ఆదేశాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా బీఎస్ 4 వాహనాల విక్రయాలు మందగించాయి. దీంతో మార్చి 31వ తేదీ వరకు ఆ వాహనాల అమ్మకానికి ఉన్న గడువును సుప్రీం కోర్టు పొడిగించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న వాహన తయారీ కంపెనీలు, విక్రయదారులకు భారీ ఊరట లభించింది.
బీఎస్ 4 ప్రమాణాలు ఉన్న వాహనాల విక్రయాలకు మార్చి 31వ తేదీని ఆఖరి గడువుగా గతంలో కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్ 6 ప్రమాణాలను దేశవ్యాప్తంగా వాహన విక్రయదారులు అమ్మాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో బీఎస్ 4 ప్రమాణాలు ఉన్న వాహనాల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఆ వాహనాలు డీలర్ల వద్ద పెద్ద ఎత్తున నిల్వ ఉన్నాయి. అయితే వాటిని అమ్ముకునేందుకు తమకు మరిన్ని రోజులు గడువు కావాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఏడీఏ) సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
కాగా ఎఫ్ఏడీఏ వేసిన పిటిషన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌లో విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. బీఎస్ 4 ప్రమాణాలు ఉన్న వాహనాలను విక్రయించేందుకు డీలర్లకు మరింత గడువునిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ అనంతరం మరో 10 రోజుల పాటు బీఎస్ 4 వాహనాలను డీలర్లు అమ్ముకోవచ్చు. ఆ తరువాత నుంచి బీఎస్ 6 ప్రమాణాలు ఉన్న వాహనాలను విక్రయించాలి. అయితే లాక్‌డౌన్ తీసేశాక ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మాత్రం బీఎస్ 4 ప్రమాణాలు ఉన్న వాహనాలను విక్రయించరాదని సుప్రీం తీర్పు చెప్పింది.