రాజకీయాల్లో వ్యూహాలు కామనే. అయితే, సమయం చూసుకుని నాయకులు పేల్చే మాటల తూటాలు కొంతమేరకు కలకలం రేపుతుంటాయి. తాజాగా టీడీపీకి చెందిన కీలక నాయకుడు, సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి.. తాజాగా చేసిన వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర కలకలం రేపాయి. ప్రస్తుతం రాజధాని రగడతో శాసన మండలి అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అన్ని అస్త్ర శస్త్రాలను వెలికి తీస్తోంది. రాజధా నిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు వర్గం.. దీనికి తగిన విధంగా సర్వశక్తులూ ఒడ్డు తోంది.
దీనిలో భాగంగానే శాసన మండలిలో బలం ఎక్కువగా ఉన్న టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకుసాగుతోంది. ఈ సంద ర్భంగా వైసీపీ సభ్యులు మాట్లాడుతూ.. సీఎం జగన్ ఒక మాట ఇస్తే.. వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తానని జగన్ అసెంబ్లీలో మాట ఇచ్చారని, దీనికి అనుకూలంగానే వికేంద్రీకరణ బిల్లును తీసుకువచ్చారని చెప్పారు. సో.. రాజధానిగా అమరావతి కొనసాగుతుందనిఅన్నారు. ఈ సందర్భంలో కలుగ జేసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ.. జగన్ మాటా తప్పుతాడు.. మడమ కూడా తిప్పుతాడని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, దీనికి సంబంధించి వైసీపీ నాయకుడు, గుంటూరులోని చిలకలూరి పేట నియోజకవర్గం ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ విషయాన్ని ఉటంకించారు. 2019 ఎన్నికల సమయంలో చిలకలూరి పేట టికెట్ మర్రి రాజశేఖర్‌కే దక్కాల్సి ఉందని, అయితే, అప్పట్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇక్కడ నుంచి మరో మహిళను రంగంలోకి దింపారని చెప్పిన రవి.. ఈ సందర్భంగా జగన్.. మర్రికి ఇచ్చిన హామీ విషయాన్ని మండలిలో ప్రస్థావించారు.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మర్రికి మంత్రి పదవి ఇస్తామని జగన్ బహిరంగంగానే చేసిన ప్రకటనను రవి ప్రస్తావించారు.
మరి ఇప్పటికి 8 నెలలు గడిచినా.. మర్రికి కనీసం సీఎం జగన్ మర్రికి మంత్రి పదవి కదా కదా… ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదన్న విషయం ప్రస్తావించారు. జగన్‌ను, ఆయన కుటుంబాన్ని నమ్ముకున్న విధేయుడు అయిన రాజశేఖర్‌కు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించిన రవి జగన్ మడమ తిప్పేవాడో కాదో.. మాట తప్పేవాడో .. కాదో తెలుస్తూనే ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే విధంగా రేపు అమరావతి విషయంలోనూ జగన్ మాట తప్పడని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ముఖ్యంగా వైసీపీలో కలకలం సృష్టించాయి. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో ? చూడాలి.