అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళలకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వారికి, ఎంపిక చేసి షాపింగ్ మాల్స్‌లో ఈ నెల 8వ తేదీన మొబైల్స్ ఫోన్స్ కొనుగోలు చేసే వారికి 10 శాతం రాయితీ కల్పించబోతున్నామన్నారు. ఈ ఆఫర్ కేవలం మహిళలకు మాత్రమేనని వెల్లడించారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. దిశ యాప్ అవగాహన పెంచేందుకు హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని, దీంతోపాటు యాప్‌ను ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా క్యూఆర్ కోడ్‌తో 2 వేల స్టాండ్‌లు ఎంపిక చేసిన చోట్లల్లో ఉంచాలన్నారు.
మహిళ భద్రత విషయంపై తీసుకుంటున్న జాగ్రత్త చర్యల గురించి ప్రజల్లో తీసుకెళ్లాలని, దిశ యాప్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అంగన్‌వాడీల్లో నాడు-నేడు కార్యక్రమం, మహిళా దినోత్సవం ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళల భద్రత విషయంపై షార్ట్ ఫిలిం కంటెస్ట్ పోటీలను నిర్వహించాలని, గెలుపొందిన వారికి ప్రైజ్ మనీ ఉంటుందన్నారు. అలాగే పోలీసు విభాగంలో అత్యున్నత సేవలు అందిస్తున్న మహిళా కానిస్టేబుళ్లను సన్మాలించాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవరం రోజు పోలీసు శాఖలో పని చేస్తున్న మహిళలందరికీ స్పెషల్ డే ఆఫ్ ప్రకటించారు. అలాగే అంగన్‌వాడీ టీచర్లకు ప్రతియేటా హెల్త్ చెకప్, మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్ లీవ్స్ ఇస్తున్నామన్నారు.
నాన్ గెజిటెడ్ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల వరకు డబ్బులు ఇస్తామన్నారు. పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థినులకు ప్లస్-1, ప్లస్-2లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పాఠశాలలో ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీలు అందజేయాలన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 44,119 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వీటితోపాటు మహిళా దినోత్సవాన్ని ముందురోజు (7వ తేదీ) రాష్ట్రవ్యాప్తం క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలన్నారు.