చాలామందికి రాత్రిపూట నిద్రపోయే ముందు పాదాల్లో వింతగా మంటలు రావడం, లేదా కాళ్లు మొద్దుబారిపోయినట్టుగా అనిపించడం జరుగుతుంటుంది. అయితే ఎక్కువ మంది దీనిని సాధారణ అలసటగా భావించి పట్టించుకోరు. రోజంతా నడిచాను కదా అందుకే ఇలా ఉంది అని సరిపెట్టుకుంటారు. కానీ నిజానికి ఇది శరీరం ఇస్తున్న ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చు. మనకు తెలియకుండానే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటే, మొదటగా ప్రభావం చూపేది పాదాలపై ఉంటుంది. నరాలపై ప్రభావం పడటంతో మంటలు చిమ్మటలు కుట్టినట్టు అనిపించడం, మొద్దుబారడం లాంటి సమస్యలు వస్తాయి. పాదాల మంటలకు షుగర్‌కు ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు మనం సులభంగా, స్పష్టంగా తెలుసుకుందాం.
పాదాల్లో మంటలు: మీ శరీరం ఇచ్చే అలారం లాంటిది ఇది. మన రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉన్నప్పుడు అది మన శరీరంలోని నరాలపై ప్రభావం చూపుతుంది. దీనినే వైద్య భాషలో ‘డయాబెటిక్ న్యూరోపతీ’ అంటారు. ఇది ప్రధానంగా కాళ్ళలోని నరాలను దెబ్బతీస్తుంది.
ఈ లక్షణాలు ఉన్నాయా?: పాదాల్లో మంటలు, పాదాల అడుగు భాగంలో సెగలు వస్తున్నట్లు లేదా మిరపకాయలు రాసినట్లు మంటగా అనిపించడం.

మొద్దుబారడం: నడుస్తున్నప్పుడు పాదాలు నేలకు తగులుతున్నాయో లేదో తెలియనంతగా తిమ్మిర్లు రావడం.
సూదులతో గుచ్చినట్లు: పాదాల్లో ఎవరో పిన్నులతో లేదా సూదులతో గుచ్చుతున్నట్లు చురుక్కుమనే నొప్పి కలగడం. పాదాల రంగు మారడం, పాదాలు ఎర్రబడటం లేదా చర్మం పాలిపోయినట్లు కనిపించడం.
షుగర్ వల్ల ఇది ఎందుకు జరుగుతుంది?: రక్తంలో షుగర్ పెరిగినప్పుడు, అది నరాలకు రక్తాన్ని చేరవేసే చిన్న చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల నరాలకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందవు. ఫలితంగా నరాలు బలహీనపడి, మెదడుకు తప్పుడు సంకేతాలను పంపుతాయి. అదే మనకు మంటగా లేదా నొప్పిగా అనిపిస్తుంది.
పరిష్కార మార్గాలు ఏమిటి?: షుగర్ పరీక్ష: వెంటనే రక్త పరీక్ష చేయించుకుని చక్కెర స్థాయిలను తెలుసుకోండి.
పాదాల సంరక్షణ: ప్రతిరోజూ పడుకునే ముందు పాదాలను గోరువెచ్చని నీటితో కడిగి, గాయాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి.
సరైన పాదరక్షలు: మరీ బిగుతుగా ఉండే చెప్పులు వాడకండి. మెత్తటి కుషన్ ఉన్న పాదరక్షలను ఎంచుకోండి. ఇక క్రమం తప్పకుండా నడవడం వల్ల కాళ్ళలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
గమనిక: పాదాల్లో మంటలు కేవలం షుగర్ వల్లే కాకుండా విటమిన్ బి12 లోపం, కిడ్నీ సమస్యలు లేదా థైరాయిడ్ వల్ల కూడా రావచ్చు. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టరును సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
