ప్రస్తుత శాసనసభలో వారు ముగ్గురూ సభ్యులు. ముగ్గురూ ఒకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు గత ఎన్నికల్లో. కేవలం గత ఎన్నికల్లోనే కాదు.. గతంలో కూడా ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన నేపథ్యం ఉంది వారికి. ఉమ్మడి ఏపీలో ఇలాంటి రాజకీయ కుటుంబాలకు తగు ప్రాధాన్యత లభించేది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న సందర్భాల్లో వారిలో ఒకరికైనా మంత్రి పదవి దక్కిన చరిత్ర ఉండనే ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకేసారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ముగ్గురు బ్రదర్స్ లో ఒకరికైనా ఇప్పుడు మంత్రి పదవి దక్కుతుందా? అనేది ఒకింత ఆసక్తిదాయకమైన అంశం.
కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, అదే జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి, ఈ నియోజకవర్గాలకు ఆనుకుని ఉన్న అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి. ఈ పొలిటికల్ బ్రదర్స్ లో ఇప్పుడు ఒకరికైనా మంత్రి పదవి దక్కుతుందా? అనే చర్చ సాగుతూ ఉందిప్పుడు. రెండు జిల్లాల కోటాలో.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల్లో.. ఒక్కరైనా మంత్రి అవుతారా? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభించనుంది.
విశేషం ఏమిటంటే.. వీరు ముగ్గురూ రాజకీయంగా అనుభవజ్ఞులే. వరసగా ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారే. మంత్రాలయం నుంచి బాల నాగిరెడ్డి 2009 నుంచి వరసగా నెగ్గుతున్నారు. 2009లో బాలనాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే ఆ వెంటనే ఆ పార్టీకి దూరం అయ్యారు. టీడీపీ రెబల్ గా కొనసాగారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు ఇదే నియోజకవర్గం నుంచి. 2019 లో కూడా మంచి విజయాన్నే నమోదు చేశారు. ఇలా హ్యాట్రిక్ విజయాలతో ఆంధ్రా కర్ణాటక సరిహద్దుల్లోని ఆ నియోజకవర్గం నుంచి బాల నాగిరెడ్డి మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ విషయంలో ఆశావహుడిగా ఉన్నారు.
ఇక ఆదోని నుంచి వరసగా నెడ్డుతున్నారు వై సాయి ప్రసాద్ రెడ్డి. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన సాయి ప్రసాద్ రెడ్డి, 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వరసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు.
అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి వై వెంకట్రామి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న వెంకట్రామిరెడ్డి, 2019లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా నెగ్గారు.
విశేషం ఏమిటంటే.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విధేయతతో ఉన్న వారే. 2014, 19ల మధ్యన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వైపు వెళ్లినా, సాయి ప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే కొనసాగారు.
ఇంతే కాదు.. వీరి బ్రదర్ మరొకరున్నారు. ఆయనే ఉరవకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వై శివరామిరెడ్డి. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా జగన్ తరఫున మాట్లాడిన నేతల్లో శివరామిరెడ్డి ఒకరు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చర్చల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉన్నారు.
ఇలా అటు వైపు ఉరవకొండ నుంచి, ఇటు మంత్రాలయం వరకూ వీరు నాలుగు నియోజకవర్గాల పరిధిలో తమ ఉనికిని చాటుకున్నారు. అది కూడా దశాబ్దాల నుంచి రాజకీయంగా పట్టును కొనసాగిస్తూ ఉన్నారు. ఇంట్లో అంతా ఎమ్మెల్యేలే అయినా.. ఏదో మాఫియాను నడుపుతున్నట్టుగా రాజకీయం చేయడం కానీ, తమదో పెద్ద రాజకీయ కుటుంబం అనే అహంకానీ వీరి వ్యవహారంలో కనిపించరు. ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటేనే.. అలాంటి ఫ్యామిలీలు హల్చల్ చేస్తుంటాయి. కనీసం ఒక్కరు ఎమ్మెల్యేగా ఉన్నా.. ఇంట్లో వాళ్లంతా తాము కూడా ఎమ్మెల్యేలే అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్న రోజులు ఇవి.
మరి రాజకీయ పరిధి ఉన్నా.. అహాలకూ, ఇగోలకూ పోకుండా.. హద్దుల్లో ఉండి వ్యవహరించే ఈ ముగ్గురు బ్రదర్స్ లో ఎవరైనా జగన్ మెప్పు పొంది మంత్రులు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే.. సామాజికవర్గ సమీకరణాలు వీరి పాలిట ఇబ్బంది కరమైనవి. అటు కర్నూలు, ఇటు అనంతపురం జిల్లాలో చాలా మంది రెడ్లు మంత్రి పదవుల మీద ఆశావహులుగా ఉన్నారు. ఇదే ఈ బ్రదర్స్ కు పెద్ద ఆటంకం!