టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ పై పోలీసు కేసు నమోదయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై శ్రీరామ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ తోపుదుర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని స్థానిక వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్ తో పాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్ పై కూడా కేసు నమోదు చేసిట్టు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 153 ఏ, 505 (2) కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.
ఆత్మకూరు మండలం సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా పరిటాల పాదయాత్ర చేశారు. రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత గ్రామాల్లో అరటి, టమోటా పంటలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వై.కొత్తపల్లిలో పరిటాల శ్రీరామ్ కాడి పట్టగా.. మాజీ మంత్రి పరిటాల సునీత విత్తనం వేశారు. తర్వాత సభలో కార్యకర్తలనుద్దేశించి పరిటాల శ్రీరామ్ ప్రసంగిస్తూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.