గత కొద్ది రోజులుగా చూస్తుంటే తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయని అనిపిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 27కు ముందు రోజుకు 10వేలపైనే కేసులు నమోదయ్యాయి. ఒకానొక దశలో ఏకంగా 13వేలదాకా కేసులు పెరిగాయి. కానీ ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీంతో అందరూ కేసులు తగ్గాయని భావిస్తున్నారు. అయితే కేసులు తగ్గలేదని, ఇక్కడ అసలు విషయం మరోటి ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గలేదని, ప్రభుత్వమే కావాలని లెక్కలు తారుమారు చేసి తగ్గించి చూపిస్తోందని మండిపడ్డారు. ఏప్రిల్ 27కుముందు టెస్టులు బాగా చేశారని అందుకే కేసులు పెరిగాయన్నారు.
కానీ ఏప్రిల్ 27 తర్వాత నుంచి వరుసగా టెస్టులు తగ్గిస్తూ వస్తున్నారని అందుకే కేసులు తక్కువగా నమోదవుతున్నాయని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో ఆదివారం కేవలం 55వేల టెస్టులు మాత్రమే చేశారని, కరోనా వ్యాప్తిని తగ్గించడానికే ఇలా కేసీఆర్ టెస్టులు తగ్గిస్తున్నారని ఎద్దేశా చేశారు. ఏప్రిల్ 26న 99,638 టెస్టులు చేశారని, కానీ ఇప్పుడు తగ్గించడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.