రోజురోజుకీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. ఆస్పత్రిలో కొందరూ సిబ్బంది చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వ ఆస్పత్రిని దూషించడం జరుగుతోంది. కడప జిల్లాలోని ఏకైక వైద్య ప్రదాయిని కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి. ఈ ఆస్పత్రిలో జిల్లాకు చెందిన ప్రతిఒక్కరూ తమ ఆరోగ్య పరిస్థితి మెరుగు కోసం వస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు జరిగినా ఈ ఆస్పత్రికే తీసుకొస్తుంటారు.
‘‘ నా పేరు కరిమున్నీసా. మాది కడప పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీ. ఇటీవల మా మేనల్లుడు ఖాజా కోవిడ్-19తో ప్రాణాలు విడిచాడు. దీంతో వైద్యాధికారులు పోస్టుమార్టంకు కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి శవాగారానికి తరలించారు. అయితే శవాగారంలో పని చేసే సిబ్బంది మృతదేహాన్ని అప్పగించాలంటే రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇక్కడ మృతదేహాన్ని చూడాలన్నా.. ఖననం చేయాలన్నా.. డబ్బులు ఇవ్వాల్సిందే. లేకుంటే మాకు సంబంధం లేదని చేతులెత్తేస్తారు. గత్యంతరం లేక డబ్బులు ఇచ్చి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఖననం చేశాం.’’ అంటూ ఆమె పేర్కొంది.
‘‘నా పేరు అమర్. మాది రాయచోటి గ్రామం. ఇటీవల మా అత్త లక్ష్మిదేవి కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రాణాలు విడిచింది. కరోనా ఉందని అనుమానంతో మృతదేహాన్ని శవాగారంలో ఉంచారు. ఉదయం వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లమని సిబ్బంది తెలిపారు. మరుసటి రోజు వెళ్లాం. అక్కడి సిబ్బంది మద్యానికి డబ్బులు అడిగాడు. మద్యం తాగకుండా మృతదేహాన్ని ప్యాకింగ్ చేయాలంటే మా వల్ల కాదంటూ చేతులెత్తారు. డబ్బులు ఇస్తే తాగి పని చేస్తామన్నారు. మందు, స్టప్, ఇతర సామగ్రికి మొత్తం రూ.3 వేలు ఇవ్వమన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చేసేదేమి లేక బంధువుల వద్ద అప్పు తీసుకుని ఇచ్చా.’’ అంటూ ఆయన వాపోయాడు. అయితే ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఫోరెన్సి విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాసనాయక్ తెలిపారు.