పిల్లల ముక్కు నుండి రక్తం రావడం (Nosebleed or Epistaxis) చూసినప్పుడు తల్లిదండ్రులు సహజంగానే కంగారుపడతారు. ముక్కులోంచి రక్తం వస్తే, అది ఏదో పెద్ద సమస్యకు సంకేతం ఏమోనని భయపడటం మామూలే. కానీ చాలా సందర్భాలలో చిన్నారులలో ముక్కు నుండి రక్తం రావడం అనేది పెద్ద ప్రమాదకరం కాని, సులభంగా ఆగిపోయే సమస్యే. ముక్కు లోపలి పొర చాలా సున్నితంగా ఉంటుంది. అసలు పిల్లలలో ముక్కు రక్తం రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చూద్దాం.
పిల్లలలో ముక్కు నుండి రక్తం రావడానికి (ముక్కు కారడానికి) వైద్య పరిభాషలో ఎపిస్టాక్సిస్ (Epistaxis) అని అంటారు. దాదాపు 90% వరకు ఈ రక్తస్రావం ముక్కు ముందు భాగం నుంచే జరుగుతుంది. దీనికి గల సాధారణ కారణాలు తెలుసుకోవటం ముఖ్యం.
పొడి వాతావరణం మరియు వేడి: ముక్కులో రక్తం రావడానికి అత్యంత సాధారణ కారణం పొడి వాతావరణం. వేసవి కాలంలో లేదా చలికాలంలో గదిలో హీటర్లు ఉపయోగించినప్పుడు గాలిలో తేమ శాతం తగ్గిపోతుంది. దీని వలన ముక్కు లోపలి పొర (Nasal Mucosa) పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్లలోని రక్తనాళాలు చిరిగిపోయి రక్తం వస్తుంది.

ముక్కును గిల్లుకోవడం లేదా గోకడం: పిల్లలు తరచుగా తమ వేళ్లతో ముక్కును గిల్లుకుంటారు లేదా గోకుతారు. ముక్కు లోపలి భాగంలో ఉన్న రక్త నాళాలు (Blood Vessels) చాలా సున్నితంగా చర్మం పై భాగానికి దగ్గరగా ఉంటాయి. వేలితో గట్టిగా రుద్దినా లేదా గోకినా ఆ సున్నితమైన నాళాలు దెబ్బతిని వెంటనే రక్తస్రావం మొదలవుతుంది.
గాయాలు మరియు ఒత్తిడి: పిల్లలు ఆడుకునేటప్పుడు ముక్కుకు చిన్న గాయాలు తగలడం, లేదా ముఖం నేలకు తాకడం వంటివి జరిగినా రక్తం వస్తుంది. అలాగే ఎక్కువగా తుమ్మడం లేదా గట్టిగా ముక్కు చీదడం వలన కూడా ముక్కు లోపలి రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి రక్తం రావొచ్చు.
అలెర్జీలు మరియు ఇన్‌ఫెక్షన్లు: సాధారణ జలుబు సైనసైటిస్ లేదా ముక్కు సంబంధిత ఇతర అలెర్జీలు ఉన్నప్పుడు ముక్కు లోపలి పొర వాచి చికాకుగా మారుతుంది. ఈ వాపు కారణంగా రక్త నాళాలు మరింత సున్నితమై తేలికగా చిరిగి రక్తం రావడానికి దారితీయవచ్చు.
చిన్నారులలో ముక్కు రక్తం రావడం చూసి భయపడకుండా సరైన పద్ధతిలో ముక్కును నొక్కిపట్టి ప్రథమ చికిత్స చేస్తే చాలా సందర్భాలలో వెంటనే ఆగిపోతుంది. తరచుగా రక్తం వస్తుంటే లేదా రక్తస్రావం ఎక్కువ సేపు ఆగకపోతే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఏదయినా ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ ను సంప్రదించండి.