జగన్ ఆస్తుల కేసులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ షాక్ ఇచ్చింది. వైఎస్ జగన్ పై విచారణలో ఉన్న అక్రమాస్తుల కేసుల్లో భాగమైన వాన్ పిక్ వ్యవహారంలో మాజీ మంత్రి, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావుపై విచారణ చేపట్టవచ్చని సీబీఐ కోర్టుకు దర్యాఫ్తు సంస్థ సీబీఐ తెలిపింది. వాన్ పిక్ కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ధర్మానపై ఆరోపణలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంత్రి పదవిలో లేకున్నా, ప్రభుత్వం మారినా, అ.ని.శా చట్టం కింద ఉన్న కేసులను విచారించవచ్చని గతంలో సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తు చేసిన సీబీఐ తరఫు న్యాయవాది ధర్మాననూ విచారించాల్సి ఉందని స్పష్టం చేశారు.
అయితే జగన్ ఆస్తుల కేసులో ధర్మాన ప్రసాదరావుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన కేసు ఎంతవరకు వచ్చిందని హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి బీవీ మధుసూధన్ రావు ఇటీవల సీబీఐని వివరాలు కోరారు. దీనికి సంబంధించి జనవరి 7వ తేదీలోపు తమకు వివరాలు అందించాలని ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే.