కొత్త సంవత్సరంలో మరింత కష్టపడి పని చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమంపై ఫోకస్ పెంచుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అంతా గత ప్రభుత్వం చేసిన అప్పుల సర్దుబాటుపైనే సరిపోయిందని వివరించారు. కొత్త ఏడాదిలో సంక్షేమం, డెవలప్ ను జోడెద్దుల తరహాలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి విషెస్ చెప్పారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు తయారయ్యాయని, ప్రజలకు మేలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. ఇక తొలిసారి తాను ప్రజా ప్రతినిధి హోదాలో సీఎంను కలవడం సంతోషకరంగా ఉన్నదన్నారు. కొత్త తరం లీడర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఆయన పనితీరు, కెపాసిటీ, ఆలోచన విధానాలు, నిర్ణయాలన్నీ పేద ప్రజలకు కాపాడటమే లక్ష్యంగా ఉంటాయన్నారు. కొత్త ఏడాదిలో గత ఏడాది కంటే భిన్నంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం సూచించినట్లు ఎంపీ తెలిపారు.