తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ముందు నుంచి భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏకంగా అభ్యర్థిని కూడా ప్రకటించేసింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా తిరుపతి లోక్ సభ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు అని ప్రకటించారు. ఈ రోజు చంద్రబాబు తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ముందు అభ్యర్ధిని ప్రకటించిన ఆయన ఈ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అవలంభించాల్సిన తీరు గురించి చర్చించారు.
2019లో జరిగిన ఎన్నికల్లో కూడా పనబాక లక్ష్మి అదే స్థానానికి పోటీ చేసి బల్లి దుర్గాప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. కొత్త వారిని ఎవరినైనా ప్రకటిస్తే మళ్ళీ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకోవడానికి సమయం పడుతుందని భావించిన బాబు పనబాక లక్ష్మికి ఈ టికెట్ కట్ట పెట్టినట్టు సమాచారం. ఒకవేళ తెలుగుదేశం నుంచి టిక్కెట్ లభించకపోతే ఆమె బిజెపి కి వెళ్లి అక్కడ నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. ఇక చంద్రబాబు ఈ ప్రకటన చేయడంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక వైసీపీ కూడా బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరో పక్క తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుచుకున్న బీజేపీ ఏపీలో కూడా ఈ ఎన్నికల్లో గెలిచి బలం పెంచుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం అయితే ప్రధాన పోటీ వైసీపీ టీడీపీల మధ్య ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది.