తాడిపత్రి ఘటనకు సంబంధించి ఏపీ సిఎం జగన్ కు, డిజిపికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. తాడిపత్రిలో వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గ్యాంగ్ అరాచకాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దాడి, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు ప్రత్యక్ష సాక్ష్యం అని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన అన్నారు.
కరడుగట్టిన ఫాక్షనిస్టులు కూడా ఇటువంటి దుర్మార్గానికి తెగించిన దాఖలాలు లేవన్న ఆయన ప్రతిపక్ష నాయకుడి ఇంటికెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడం రాష్ట్ర చరిత్రలో లేదని అన్నారు. గత 19నెలల్లో వరుస దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ఎప్పుడు, ఎటునుంచి, ఏ మాఫియా మూక దాడిచేస్తుందో అనే భయాందోళనల్లో ప్రజలు. ప్రాణాలు అరచేత పెట్టుకుని అన్ని వర్గాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణానికి ఇసుక కోసం ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణకు టిడిపి మాజీ ఎమ్మెల్యేకు సంబంధం ఉంటుందా..? అని ఆయన ప్రశ్నించారు.