చలికాలం వచ్చిందంటే చర్మంలో రకరకాల మార్పులు వస్తుంటాయి. పొడిబారిపోవడం, పగుళ్ళు ఏర్పడటం మొదలగున సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఐతే కేవలం చర్మమే కాదు జుట్టు సమస్యలు కూడా చలికాలంలో బాగా వస్తుంటాయి. ముఖ్యంగా చల్లగాలులు పడని వారికి ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. దీనివల్ల జుట్టు పొడిబారిపోయి చుండ్రు ఏర్పడి, చికాకు పెడుతుంటుంది. ఈ సమయంలో జుట్టు సంరక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మీలో ఎవరైనా ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతుంటే వారికోసం మేం సరికొత్త చిట్కాతో ముందుకు వచ్చాం.
అవిసె గింజల నూనె ద్వారా చలికాలంలో వచ్చే జుట్టు సమస్యల నుండి బయటపడవచ్చు. మార్కెట్లో దొరికే ఖరీదైన వాటి జోలికి పోకుండా ఇంట్లోనే ఉండి జుట్టు సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
అవిస గింజల నూనె ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
ముందుగా కావాల్సిన పదార్థాలు.
నాలుగు కప్పుల అవిస గింజలు
ఏదైనా మంచినూనె ఒక కప్పు
మంచినీరు ఒక కప్పు
ఈ ప్రాసెస్ మొదలెట్టడానికి ముందురోజు రాత్రి అవిస గింజలు ఒక పాత్రలోకి తీసుకుని అందులో కొన్ని నీళ్ళు పోసి, నానబెట్టాలి.
పొద్దున్న లేవగానే ఆ గింజలని పెనం మీద వేడి చేయాలి. ఆ తర్వాత జల్లెడ ద్వారా వడపోసి ఆ ద్రావణాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
మీకు నచ్చిన వంటనూనె ఏదైనా అందులో కలుపుకోవచ్చు.
ఆ తర్వాత అది జిగటగా మారుతుంది. ఆ జిగట మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకోవాలి. లేదంటే చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచినా సరిపోతుంది.
తలస్నానం చేసిన తర్వాత జుట్టుకి బాగా మర్దన చేయాలి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ తలస్నానం చేస్తే సరిపోతుంది.
జుట్టు పొడిబారుతున్నా, చుండ్రు ఏర్పడినా, శిరోజాలు మృదువుగా లేకపోయినా అవిస గింజల నూనె చాలా చక్కగా పనిచేస్తుంది.